తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. పులివెందులకు చెందిన కొంతమంది భక్తులకు శ్రీవారి మెట్టు వద్ధ రోడ్డు దాటుతున్న చిరుతను గమనించారు.

విధాత : తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. పులివెందులకు చెందిన కొంతమంది భక్తులకు శ్రీవారి మెట్టు వద్ధ రోడ్డు దాటుతున్న చిరుతను గమనించారు. చిరుత సంచారాన్ని వారు వెంటనే టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు వాటర్ హౌజ్ వద్ద నుంచి భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు. చిరుత వెళ్లిన మార్గాన్ని గుర్తించి దాన్ని ట్రాప్ చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది చర్యలు ప్రారంభించారు.
గత ఆగస్టులో నెల్లూరు జిల్లాకు చెందిన మూడేండ్ల చిన్నారి లక్షితపై చిరుత పులి దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో లక్షిత మృతి చెందింది. అంతకు ముందు మరో బాలుడిపై కూడా చిరుత దాడి చేసింది. అయితే ఆ సమయంలో ఆ బాలుడి కుటుంబ సభ్యులు పెద్దగా అరవడంతో బాలుడిని కొద్ది దూరం తీసుకెళ్లి వదిలివెళ్లి పోయింది. ఆ తర్వాతా ఐదు చిరుతలను అటవీ అధికారులు బంధించారు. తాజాగా మెట్ల మార్గంలో మరో చిరుత సంచారంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
