చొప్పదండి నియోజకవర్గ బి.ఆర్.ఎస్. అభ్యర్థి సుంకే రవిశంకర్ కు ఎన్నికల ప్రచారంలో ప్రజలు చుక్కలు చూపెడుతున్నారు

చొప్పదండి నియోజకవర్గ బి.ఆర్.ఎస్. అభ్యర్థి సుంకే రవిశంకర్ కు ఎన్నికల ప్రచారంలో ప్రజలు చుక్కలు చూపెడుతున్నారు. తమ అసహనాన్ని, అభ్యర్థి పట్ల ఉన్న వ్యతిరేకతను నిరసనల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. బోయినపల్లి మండలం నీలోజిపల్లి, వరదవెల్లి గ్రామాలలో సోమవారం అధికార పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అనూహ్య పరిణామాలు సంభవించాయి. నీలోజిపల్లిలో ఓ యువకుడు నేరుగా అభ్యర్థికి చెప్పు చూపించగా, వరదవెల్లిలో ప్రచారానికి విచ్చేసిన మహిళలు బి.ఆర్.ఎస్. కండువాలను కిందపడేసి కాళ్లతో తొక్కడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తామని ఆయన మొఖం మీదనే కరాఖండిగా తేల్చిచెప్పారు. నీలోజిపల్లి గ్రామంలో రవి శంకర్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు తన కాలు చెప్పు తీసి ఆయనకు చూపించారు. దీంతో సదరు యువకుడిని బి.ఆర్.ఎస్. నాయకులు అడ్డుకున్నారు. అంతకముందు గ్రామంలోకి వచ్చిన రవి శంకర్ కు వ్యతిరేకంగా స్థానికులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వరదవెల్లి గ్రామంలోనూ ఎన్నికల ప్రచార సభలో మహిళల నుండి రవి శంకర్ నిరసనలు చవిచూశారు.


ఎక్కడికి వెళ్లినా ఇదే తంతు..

చొప్పదండి నియోజకవర్గ బి.ఆర్.ఎస్. అభ్యర్థి రవి శంకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ గ్రామం వెళ్లినా నిరసన సెగ తప్పడం లేదు. గంగాధరలో జరిగిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్. బహిరంగ సభకు మూడు రోజుల ముందు ఇదే మండలంలోని తిరుమలాపూర్, రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామాలలో రవి శంకర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇలా ఉపన్యాసం ముగించారో లేదో.. అక్కడకు వచ్చిన మహిళలు ఆయనపై విరుచుకుపడ్డారు. "ఐదేండ్లు చేసింది చాలు.. మళ్ళీ ఎదో చేస్తనని వచ్చిండు.. ఈసారి ఇగ ఇంటికి పంపుడే.." అంటూ పార్టీ నేతల ముందే తమ అభిప్రాయం ఏంటో స్పష్టం చేశారు. అభ్యర్థి అక్కడే ఉండటంతో స్థానిక నేతలు వారిని సముదాయించేందుకు నానాతంటాలు పడ్డారు.


అంతకముందు తిరుమలాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించి వెళ్ళగానే స్థానికులు ఐదేండ్ల తరువాత వచ్చి పది నిముషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయాడని శాపనార్థాలు పెట్టారు. తమ పొరుగు గ్రామమైన బూరుగుపల్లిలో ఉంటున్న ఎమ్మెల్యే ఈ ఐదేండ్లలో తమ గ్రామం మీదుగా నిత్యం రాకపోకలు సాగించినా, ఒక్కనాడు ఇక్కడ ఆగిందిలేదన్నారు. బూరుగుపల్లి చౌరస్తా నుండి తన ఇంటిముందు వరకు సిమెంట్ రోడ్డు వేయించుకున్న ఎమ్మెల్యే గతుకులతో ప్రయాణానికి వీలులేని తమ గ్రామానికి వచ్చే రహదారిని ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.

ఆ గ్రామంలోకి అడుగుపెట్టనివ్వడం లేదు..

కొడిమ్యాల మండలం సూరారం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళడానికే బి.ఆర్.ఎస్. అభ్యర్థి వెనుకంజ వేస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా రవి శంకర్ తమ గ్రామానికి వస్తే అడుగు పెట్టనివ్వకూడదని గ్రామస్థులు నిర్ణయించడమే దీనికి కారణం. దీంతో కేవలం తన అనుచరులను మాత్రమే ఈ గ్రామంలో ప్రచారానికి పంపించాల్సిన దుస్థితి ఆయనకు దాపురించింది. వాస్తవానికి శాసనసభ్యునిగా గెలుపొందిన అనంతరం రవి శంకర్ ఒకే ఒక్కసారి ఈ గ్రామానికి వచ్చారు. గోవిందారం, సూరంపేట, గంగారం తండా గ్రామాలకు శ్యామల చెరువు ద్వారా వ్యవసాయ భూములకు నీరు అందాల్సి ఉంది. అయితే పోతారం మత్తడి ఎత్తు పెంచకపోవడంతో పంప్ హౌజ్ లోకి నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఈ మూడు గ్రామాల ప్రజలు ఇసుక బస్తాలతో స్వయంగా మత్తడి ఎత్తు పెంచుకున్నారు. అనంతరం పంప్ హౌజ్ ప్రారంభం పేరిట తొలిసారి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆయన ఇటువైపు రావడమే మానుకున్నారు. కొద్దిరోజుల క్రితం సూరారం గ్రామస్థులు ఐ.కె.పి. కేంద్రానికి సంబంధించి సమస్య చెప్పుకోవడానికి బూరుగుపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. "ఎవరి అపాయింట్మెంట్ అడిగి ఇక్కడకు వచ్చారు.. నేను ఇంట్లో ఉన్నట్లు చెప్పింది ఎవరు.." అంటూ వారిపై మండిపడ్డారు. దీంతో గ్రామస్థులు సమస్య చెప్పుకోకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల గ్రామానికి వెళ్లిన రవి శంకర్ అనుచరులు స్థానికుల కోసం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు ఎవరు పంపారు? దేనికోసం పంపారు? అంటూ వారిని నిలదీశారు. అనుమతి లేకుండా తన వద్దకు రావద్దని చెప్పిన రవి శంకర్ ను తమ అనుమతి లేకుండా తమ గ్రామంలోకి రానివ్వమని తేల్చి చెప్పారు. గడిచిన ఐదేండ్ల కాలంలో ఎమ్మెల్యే ఈ గ్రామ అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా విదిల్చలేదని, దళిత బంధు, బి.సి. రుణాలలో కూడా ఏ ఒక్కరికీ లభ్ది చేకూర్చలేదని మండిపడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నల్లా నీరు లేని గ్రామం లేదని చెపుతుండగా, మిషన్ భాగీరథలో ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే చేర్చలేకపోయారని, దీంతో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి చొరవ తీసుకొని వాటర్ ట్యాంక్ కట్టించారని స్థానికులు తెలిపారు. ఈ కారణాలతో ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు కూడా బి.ఆర్.ఎస్. అభ్యర్థికి మొఖం చెల్లడం లేదు.

Updated On 20 Nov 2023 2:42 PM GMT
karunakar

karunakar

Next Story