Gold Price | బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.60వేల మార్క్‌ను దాటింది. దీంతో బంగారం కొనేవారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండడంతో వారికి ఇది షాకింగ్ వార్తే. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతుండడంతో.. దేశీయ మార్కెట్లపై సైతం ప్రభావం చూపుతుందని, దాంతో దేశంలోనూ రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1600కిపైగా పెరిగి రూ.60,320కి చేరింది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1500 మేర పెరిగి.. రూ.55,300కి చేరింది. గత మూడు రోజుల్లో పుత్తడి ధర దాదాపు రూ.2500 వరకు పెరిగింది. మరో వైపు వెండి ధర సైతం పైకి కదులుతున్నది. ఒకే రోజు రూ.1300 పెరిగి.. కిలో రూ.74,400కు చేరింది.
కేవలం ఇది బంగారం ధరమాత్రమే కాగా.. దీనికి జీఎస్టీని జోడిస్తే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరో వైపు పుత్తడి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పది గ్రాములకు దాదాపు రూ.65వేల వరకు చేరవచ్చని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల సంక్షోభం ఫలితం..
యూరప్‌లో బ్యాంకింగ్ సంక్షోభం తీవ్రతరమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి తులం ధర రూ.1,630 పెరిగి రూ. 60,320 వద్ద స్థిరపడింది. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ పెరుగుదల కనిపించింది.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులతో పాటు యూరప్‌లో పలు బ్యాంకుల సంక్షోభం నేపథ్యంలో పుత్తడి మార్కెట్ పరుగులు తీసింది. సంక్షోభ సమయాల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారం కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడడంతో ధర భారీగా పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం ఔన్సు బంగారం ధర వేగంగా 2వేల డాలర్ల స్థాయి దాకా చేరింది. ఒకేసారి 70 డాలర్లు పెరిగి 1,993 డాలర్ల వద్ద స్థిరపడింది. కొవిడ్-19 మహమ్మారి తర్వాత 2020 ప్రథమార్థంలో పెరిగిన తీరుగా మూడేళ్ల తర్వాత బంగారం ధర పరుగులు పెట్టింది. వారంలో 5.6 శాతం పెరిగింది. 2020 మార్చి తర్వాత ఒక వారంలో బంగారం ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.
2022 ఏప్రిల్ తర్వాత ప్రపంచ మార్కెట్‌లో బంగారం గరిష్ఠ ఇదే ఇదేకావడం గమనార్హం. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్చి 22 నాటి సమీక్షలో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌పెడుతుందన్న ఆశలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బంగారం పెరగడానికి ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.