ద్విచక్ర వాహనదారులకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాక్‌ ఇచ్చింది. సూపర్‌ మీటియో 650 మోడల్‌ ధరను రూ.6500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది

విధాత‌: ద్విచక్ర వాహనదారులకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాక్‌ ఇచ్చింది. సూపర్‌ మీటియో 650 మోడల్‌ ధరను రూ.6500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అయితే, బైక్‌లో అదనంగా ‘వింగ్‌మ్యాన్‌’ ఫీచర్‌ను జతచేసినందున ధర పెంపు తప్పలేదని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ పేర్కొంది. రాబోయే రోజుల్లో అన్ని మోడల్స్‌ను వింగ్‌మ్యాన్‌ ఫీచర్‌ను ప్రామాణికంగా అందించాలని కంపెనీ భావిస్తున్నది.

ఇప్పటికే సూపర్ మీటియో 650 మోడల్‌ బైక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు నామమాత్రపు ఫిట్‌మెంట్‌ ధరతో వింగ్‌మ్యాన్‌ పరికరాన్ని కొనుగోలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ నెల 16 నుంచి బైక్‌ను బుక్‌ చేసుకున్న వినియోగదారులు మాత్రం ఈ ఫీచర్‌ను ప్రామాణికంగా పొందుతారని కంపెనీ పేర్కొంది.

అయితే, ఈ వింగ్‌మ్యాన్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌లలో ఉండే రాయల్ ఎన్‌ఫీల్డ్ అప్లికేషన్‌లో అంతర్భాగంగా వస్తుండగా.. టెలిమాటిక్స్ హార్డ్‌వేర్‌తో పని చేస్తుంది. రైడర్‌కు బైక్‌కు పనితీరు, ఏవైనా సమస్యలు వస్తే గుర్తించి ఆ సమాచారాన్ని ఇస్తుంది. ఇందులో ఇంటరాక్టివ్‌ డ్యాష్‌ బోర్డు సైతం ఉంటుంది. దాంతో ఫ్యూయెల్‌ లెవల్‌, బ్యాటరీ స్టేటస్‌, సర్వీస్‌ నోటిఫికేషన్లు పొందే వీలుంటుంది.

ఇంజిన్‌ ఆన్‌, ఆఫ్‌ అలెర్ట్స్‌, జీపీఎస్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌, చివరిగా పార్క్‌ చేసిన లొకేషన్‌ ట్యాకింగ్‌, వాక్‌ టూ మై మోటర్‌ సైకిల్‌ తదితర సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తుంది. సడన్ బ్రేకింగ్, సడన్ యాక్సిలరేషన్, రోజువారీ రైడ్స్, రైడింగ్ ప్యాటర్న్స్, రైడ్ రూట్స్, గరిష్ట వేగం, సగటు వేగం మొదలైన సమాచారాన్ని సైతం ఈ వింగ్‌మ్యాన్‌ ఫీచర్‌ అందిస్తుంది.

ఫీచర్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ప్రయాణం మరింత సురక్షితమవుతుందని కంపెనీ సీఈవో బీ గోవిందరాజన్ పేర్కొన్నారు. కస్టమర్లకు మరింత సురక్షిత రైడింగ్ అనుభవాన్ని ఇచ్చే దిశగా ఫీచర్‌ను తీసుకువచ్చామన్నారు. ఈ ఫీచర్‌ వినియోగదారులను ఆకర్షిస్తుందనే నమ్మకం ఉందని వివరించారు.

Updated On 18 Nov 2023 3:30 AM GMT
Somu

Somu

Next Story