దక్షిణాది సినిమా పరిశ్రమలో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తనదైన నటనతో గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎక్కువగా విలన్‌ పాత్రలు చేసినా అందరినీ మెప్పించారు

విధాత‌: దక్షిణాది సినిమా పరిశ్రమలో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తనదైన నటనతో గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎక్కువగా విలన్‌ పాత్రలు చేసినా అందరినీ మెప్పించారు. అయితే, ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. హీరోయిన్‌ త్రిషతో రేప్‌ సీన్‌ ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో మన్సూర్‌ మాట్లాడుతూ తాను చాలా సినిమాల్లో హీరోయిన్స్‌తో రేప్‌ సీన్స్‌ చేశానని.. అయితే, ఆ సీన్స్‌లో బాగా ఎంజాయ్‌ చేసేవాడినన్నారు.

లియో సినిమాలోకి తీసుకున్నప్పుడు త్రిషతో కూడా తనకు రేప్‌ సీన్‌ ఉంటుందేమోనని భావించానని.. అలాంటి సీన్‌ లేకపోవడంతో బాధపడ్డ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తమిళంతో పాటు పలు సినిమా ఇండస్ట్రీలను కుదిపేశాయి. ఈ వ్యాఖ్యలపై లియో దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, నటుడు కార్తీక్‌ సుబ్బరాజు, సింగర్స్‌ మాళవిక, చిన్నయి, నటుడు నితిన్‌తో పాటు స్పందించారు. త్రిషకు మద్దతు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై త్రిష సైతం స్పందించింది. వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. మహిళలను ద్వేషిస్తున్నట్లు మన్సూర్‌ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి వారితో సినిమాలో సీన్స్‌ లేనందుకు సంతోషిస్తున్నానని.. ఆయనతో కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటానని సోషల్‌ మీడియా పోస్ట్‌లో తెలిపింది.

తాజాగా ఈ వ్యవహారంపై మన్సూర్‌ అలీ సైతం స్పందించారు. తన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యిందని తన ఫ్యామిలీ ద్వారా తెలుసుకున్నానని.. తాను పూర్తిగా మాట్లాడింది చూడకుండా కట్‌ చేసి యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని ఆరోపించారు. తనకు కూతుళ్లు ఉన్నారని.. తన కూతురు లియో ఓపెనింగ్‌కు వచ్చిందని.. ఆమె త్రిషకు పెద్ద ఫ్యాన్‌ అని చెప్పారు. తను త్రిషతోనూ మాట్లాడిందని.. కావాలనే కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇటీవల రాజకీయాల్లో చేరబోతున్నానని.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తనను అందుకే నెగెటివ్‌గా చూపిస్తున్నారని.. ఇది తన పరువుకు నష్టం లాంటిదంటూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

మరో వైపు మన్సూర్‌ అలీఖాన్‌పై సెక్షన్‌ 503బీ కింద కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశిస్తూ జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. హీరోయిన్‌ త్రిషపై నటుడు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నటుడు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నట్లు పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు మహిళలపై హింసను సాధారణీకరిస్తాయని.. వాటిని ఖండించాలని కోరింది.

Updated On
Somu

Somu

Next Story