విధాత: ప్రధాన క్రిప్టోకరెన్సీల విలువలు మంగళవారం భారీగా పతనమయ్యాయి. బిట్‌కాయిన్ కూడా వీటిలో ఒకటి. క్రిప్టోకరెన్సీల పతనంతో రూ.వేలాది కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. ప్రముఖ క్రిప్టోకరెన్సీ లెండింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సెల్సియస్ నెట్వర్క్.. ఉపసంహరణ, ఖాతాల మధ్య బదిలీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు ముఖ్య కారణం.
బిట్‌కాయిన్ మంగళవారం ఉదయం 11:31 గంటల సమయంలో 10 శాతం మేర కుంగి 22,765 డాలర్ల వద్ద కదులుతున్నది. 2021 ఆగస్టులో 68,789 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠానికి చేరిన బిట్‌కాయిన్ అక్కడి నుంచి ప్రస్తుతం 66 శాతానికి పైగా పతనమైంది. రెండో అత్యంత విలువైన క్రిప్టోరెన్సీగా చలామణి అవుతున్న ఇథేరియం విలువ 8 శాతానికి పైగా దిగజారి 1,225 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ద్రవ్యోల్బణ భయాలు, ఫెడరల్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు, ఆర్థిక మాంద్యం సూచనల నేపథ్యంలో టెక్ స్టాక్స్, డిజిటల్ కరెన్సీ వంటి రిస్క్‌తో కూడిన మార్గాల నుంచి మదుపర్లు నిష్క్రమిస్తున్నారు. ప్రముఖ క్రిప్టోకరెన్సీ లెండింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సెల్సియస్ నెట్వర్క్ ఉపసంహరణ బదిలీలను నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది.