HomeLatest newsAlert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి.

మచ్చబొల్లారంలోని అంజనీపూరి కాలనీలో ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో మంజుల అనే మహిళ పడిపోయింది. స్థానికులు గమనించి కాపాడటంతో ప్రమాదం తప్పింది.

ఇదిలాఉంటే.. సికింద్రాబాద్, బేగంపేట్, పారడైజ్, చిలకలగూడ, మారేడ్‌పల్లి, అడ్డగుట్ట, బోయినపల్లితో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాలి లోతు మేర వర్షపు నీరు నిలవడంతో ఆ నీటిలోనే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో భారీగా ట్రాఫిక్ జాం అవడంతో.. వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్‌ఎంసీ

నగరంలో ఈరోజు రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో డీఆర్ఎఫ్ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంచింది. సికింద్రాబాద్, అల్వాల్, నెరేడ్మెట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జీహెచ్ఎంసీ పేర్కొంది.

మరో వైపు రాష్ట్రంలో అక్కడక్కడ ఈరోజు రేపు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌ఘఢ్ మీదుగా.. దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!