HomeLatest newsశ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్ల పైమాటే

శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్ల పైమాటే

  • 4 నెలలుగా రూ.100 కోట్లు దాటుతున్న వైనం
  • మేలో రికార్డు స్థాయిలో రూ.129.93 కోట్లు
  • ఏడాదికి రూ.1,500 కోట్లు దాటొచ్చ‌ని అంచ‌నా!

విధాత‌: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా కానుక‌లు వ‌స్తున్నాయి. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కొవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్లలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో హుండీ ఆదాయం బాగా తగ్గింది.

ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో టీటీడీ అనుమతిస్తోంది. కాగా, ప్రస్తుతం శ్రీవారి హుండీ ఆదాయం గతం కంటే ఎక్కువగా లభిస్తోంది. గతంలో ఏడాదికి రూ.1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం లభించేది. మే, జూన్‌ నెలల్లో రూ.100 కోట్ల మార్కును దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం నెలనెలా వచ్చే హుండీ ఆదాయం రూ.100 కోట్ల లోపే వుండేది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4 కోట్లు హుండీ ద్వారా వస్తోంది.

ఏడాదికి రూ.1,500 కోట్లు దాటొచ్చు

ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.128 కోట్లు రాగా, ఏప్రిల్‌ నెలలో రూ.127.5 కోట్లు లభించింది. మే నెలలో టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్‌ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటింది. జూన్‌ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రూ.106 కోట్ల వరకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్ల ఆదాయం లభించడంతో.. ఈ ఏడాది వార్షిక హుండీ ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!