‘మహిళల ప్రీమియర్ లీగ్’ (WPL) జట్ల వేలం సూపర్ హిట్ ఐదు జట్ల ద్వారా బీసీసీఐకి రూ. 4670 కోట్ల భారీ ఆదాయం జట్లను సొంతం చేసుకున్న వ్యాపార దిగ్గజాలు అంబానీ, అదానీ పురుషుల IPL జట్ల కంటే ఎక్కువగా బిడ్డింగ్ జట్ల వేలం వివరాలను వెల్లడించిన బీసీసీఐ కార్యదర్శి జైషా. త్వరలోనే ప్లేయర్ల వేలం ఉంటుందన్న IPL చైర్మన్ దుమాల్ ముంబై: భారత క్రికెట్‌లో మరో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. పురుషుల క్రికెట్‌తో పోల్చితే మహిళా క్రికెట్ […]

- ‘మహిళల ప్రీమియర్ లీగ్’ (WPL) జట్ల వేలం సూపర్ హిట్
- ఐదు జట్ల ద్వారా బీసీసీఐకి రూ. 4670 కోట్ల భారీ ఆదాయం
- జట్లను సొంతం చేసుకున్న వ్యాపార దిగ్గజాలు అంబానీ, అదానీ
- పురుషుల IPL జట్ల కంటే ఎక్కువగా బిడ్డింగ్
- జట్ల వేలం వివరాలను వెల్లడించిన బీసీసీఐ కార్యదర్శి జైషా.
- త్వరలోనే ప్లేయర్ల వేలం ఉంటుందన్న IPL చైర్మన్ దుమాల్
ముంబై: భారత క్రికెట్‌లో మరో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. పురుషుల క్రికెట్‌తో పోల్చితే మహిళా క్రికెట్ కు ఆదరణ తక్కువ అంటే ఇప్పుడు కుదరదు అనేలా మహిళా క్రికెట్ దశ తిరిగింది. ఐపీఎల్ తరహాలో మహిళల క్రికెట్ లోనూ లీగ్ నిర్వహించాలన్న డిమాండ్ మేరకు అయిష్టంగానే అంగీకరించిన బీసీసీఐ పంట పండింది. మహిళల ఐపీఎల్ పేరుని ‘మహిళల ప్రీమియర్ లీగ్’(WPL)గా మార్చి 5 జట్లకు బిడ్డింగ్ నిర్వహించగా.. వేలం సూపర్ హిట్టైంది.
బీసీసీఐపై కాసుల వర్షం కురిపించిన దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు.. 2008లో జరిగిన పురుషుల ఐపీఎల్ బిడ్డింగ్‌ను మించి జట్లను అత్యధిక ధరకు కొనుగోలు చేయడం విశేషం. వేలం వివరాలను బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఐదు జట్లను వేలం వేయడం ద్వారా బీసీసీఐ రూ. 4670 కోట్ల భారీ మొత్తం ఆర్జించింది.
2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ కోసం జట్ల బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే ఈ మొత్తం ఎక్కువ అని జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఇది మహిళల క్రికెట్‌లో విప్లవానికి నాంది పలుక నుందని తెలిపారు. మహిళల ప్రీమియర్ లీగ్.. మహిళల క్రికెట్‌లో అవసరమైన సంస్కరణలను తీసుకు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఐదు జట్లు ఇవే..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు సంబంధించి 5 జట్లు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, లక్నో నగరాలను ఎంపిక చేసి బిడ్డింగ్ నిర్వహించారు. పురుషుల ఐపీఎల్‌కు చెందిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల ఓనర్లు సహా అదాని గ్రూప్, కాప్రి గ్లోబల్ ఐదు జట్లను దక్కించుకున్నాయి.
వేలంలో దాదాపు 30 అతిపెద్ద కార్పొరేట్లు పోటీ పడినప్పటికీ చివరకు ఈ ఐదు కంపెనీలకు ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు దక్కాయి. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధిక ధర (1289 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకోగా.. రిలయన్స్ సంస్థలో భాగమైన ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై ఫ్రాంచైజీని రెండో అత్యధిక ధరకు (912.99 కోట్లు) దక్కించుకుంది.
బెంగళూరు జట్టును రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901 కోట్లకు, దిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ రూ.810 కోట్లకు, లక్నో జట్టును కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.757 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం మినహాయించి మిగతా యాజమాన్యాలంతా పురుషుల ఐపీఎల్‌తో సంబంధం ఉన్నవే కావడం విశేషం.
మహిళల ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల రూపేణా బీసీసీఐకి ఇప్పటికే భారీగా ఆదాయం సమకూరింది. ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను 2023-2027 వరకు ఐదేండ్ల కాలానికి గాను వయాకామ్ 18 రూ.951 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.
ఈ ఐదేండ్ల కాలంలో బీసీసీఐ మీడియా హక్కుల నుంచి వచ్చిన ఆదాయంలో 80శాతం ఫ్రాంచైజీలకు చెల్లించనుంది. త్వరలోనే ప్లేయర్ల వేలం తేదీలను ప్రకటిస్తామని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చెప్పారు.
