విధాత: మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మకు.. క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ గంభీర్ సోమవారం మద్దతుగా నిలిచారు. ‘అసహనాన్ని సహిద్దాం’ అనే హాష్‌ట్యాగ్‌తో గంభీర్ ఒక ట్వీట్ చేశారు.
‘ఒక మహిళ క్షమాపణ చెప్పినా కూడా ప్రాణహాని తలపెట్టే బెదిరింపులు చేస్తూ దేశవ్యాప్తంగా కొందరు విషం కక్కుతున్నారు. లౌకికవాదులమని చెప్పుకునేవారు పాటిస్తున్న నిశ్శబ్ధంతో చెవులు గింగురుమంటున్నాయి’ అని తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గంభీర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
నుపుర్ శర్మకు సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులు ఇదివరకే మద్దతు తెలిపారు. ‘సత్యం చెప్పడమే తిరుగుబాటయితే, నేను కూడా రెబల్నే’ అని సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ట్వీట్ చేశారు. ‘నుపుర్‌కి ఆమె అభిప్రాయం చెప్పే హక్కుంది. ఇప్పుడు ఆమెను అన్ని రకాలుగా బెదిరిస్తున్నారు. ప్రతిరోజు హిందూ దేవుళ్లను అవమానిస్తూనే ఉన్నారు. మరి మేం కోర్టుకెళితే ఏమవుతుంది.. మీరు డాన్స్ అనుకోకండి’ అని కంగనా తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది.