విధాత, హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని.. దీనిపై వివరణ ఇచ్చేందుకు తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలని భువనగిరి కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. భువనగిరి జిల్లా బి. పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.. వాటిని కాపాడాలంటూ బోరెడ్డి అయోధ్య రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. గ్రామంలోని సర్వేనెంబర్లు 208, 312 లోని దాదాపు 700 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యిందంటూ పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఈ పిటిషన్ పై ఇదివరకే విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ పేర్కొన్న భూముల సర్వే చేపట్టి డిజిటల్ మ్యాపింగ్ చేయాలని భువనగిరి జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.
అయితే తాజాగా మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తమ ఆదేశాలు అమలు చేయక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశించినట్లు ఎందుకు చర్యలు తీసుకోలేదో, అందుకు సంబంధించిన రిపోర్ట్ ఎందుకు దాఖలు చేయలేదో చెప్పాలంటూ న్యాయస్థానం భువనగిరి అధికారులను వివరణ కోరింది.
ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి స్వయంగా భువనగిరి జిల్లా కలెక్టర్ తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల (జూలై) 20కి వాయిదా వేసింది.