విధాత: ప్రముఖ పారిశ్రామికవేత్త, కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తలకెక్కారు. అక్రమ మైనింగ్, అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ కేసులు ఎదుర్కొంటు న్న ఆయన కోర్టు చిక్కులు క్రమంగా తొలిగిపోతుండటంతో మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.
బీజేపీ హైకమాండ్ కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రిని మార్చుతుందనే ఊహాగానాల నడుమ.. నేను తలుచుకుంటే సీఎం అవుతానంటూ గాలి బాంబు పేల్చారు. తరచూ బళ్లారిలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు.
తాజాగా బళ్లారి పర్యటనలో ‘నేను తలుచుకుంటే ఒక్కరోజైనా ముఖ్యమంత్రి అవుతాను. గాలి సోదరులకు, (నేను, సోమశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి) అయినా, బళ్లారి శ్రీరాములు అయినా మాకు డబ్బు అవసరమే లేదు. నాకు మంత్రి లేదా ముఖ్యమంత్రి కావాలనే కోరికా లేదు.
కానీ నేను తలచుకుంటే ముఖ్యమంత్రిని కాగలను. దానికోసమే ఒక సమయం వస్తుందని ఎదురు చూస్తున్నాను..’అని జనార్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి బళ్లారిలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో గాలి సోమశేఖర్ రెడ్డి 57వ పుట్టినరోజు వేడుకల్లో మాట్లాడుతూ జనార్ధన్ రెడ్డి ఈ కామెంట్లు చేశారు.