సమయం లేదు మిత్రమా.. భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
అంతరిక్షంలో దారి తప్పిన గ్రహశకలం ఒకటి.. వచ్చే ఏడాది భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని నాసా (NASA) హెచ్చరించింది

విధాత: అంతరిక్షంలో దారి తప్పిన గ్రహశకలం ఒకటి.. వచ్చే ఏడాది భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని నాసా (NASA) హెచ్చరించింది. 2007 ఎఫ్‌టీ3 అనే పేరుతో పిలిచే ఈ ఆస్టరాయిడ్ (Asteroid) 2024లో భూ వాతావరణంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే ఇలాంటి ఆస్టరాయిడ్‌లను నాసా గుర్తించి.. అప్రమత్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఇలా భూమిని ఢీకొట్టే ప్రమాదమున్న సుమారు 32000 ఆస్టరాయిడ్‌లను నాసా ఇప్పటికే గుర్తించి ట్రాక్ చేస్తోంది. వీటిని నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్స్ (ఎన్ఈఏ) అని పిలుస్తారు. అంతే కాకుండా 120 తోక చుక్కలను కూడా ట్రాక్ చేస్తోంది.
ఇవి భూమిని ఢీ కొట్టడానికి ఎక్కువగా అవకాశం ఉన్నవని నాసా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. వీటిని నియర్ ఎర్త్ కామెట్స్ (ఎన్ఈసీ) అని పిలుస్తారు. వీటన్నింటినీ ట్రాక్ చేస్తూ.. తగిన సూచనలు చేయడానికి నాసాకు చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (సీఎన్ఈఓఎస్) పనిచేస్తోంది. ఇప్పుడు ఇదే సంస్థ 2007 ఎఫ్ టీ 3పై సమాచారం ఇచ్చింది. ఇది సరిగ్గా 2024 అక్టోబరు 5వ తేదీన భూమిపైకి వచ్చే ప్రమాదముందని తెలిపింది.
తొలుత దీనిని 2007లో గుర్తించడంతో ఆ ఆస్టరాయిడ్‌కు 2007 ఎఫ్‌టీ3 అని పేరు పెట్టారు. అప్పుడు దానిని కేవలం 1.2 రోజులు మాత్రమే శాస్త్రవేత్తలు ట్రాక్ చేయగలిగారు. ఆ తర్వాత ఇప్పటి వరకు దాని జాడ మనకు కనిపించలేదు. గణిత సూత్రాల ఆధారంగా దాని గమనాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్తలు తాజా హెచ్చరికలు జారీ చేశారు.
అయితే అది భూమిని ఢీకొట్టడానికి ఎంత అవకాశం ఉందనే అంశంపైనా వారు అంచనాలు ఇచ్చారు. వాటి ప్రకారం.. 2007 ఎఫ్‌టీ3 భూమిని ఢీకొట్టడానికి 0.0000087 శాతం అవకాశం ఉంది. అంటే 11.5 మిలియన్ల అవకాశాల్లో ఒక సారి మాత్రమే ఈ ప్రమాదం జరిగేందుకు వీలుంది. అక్టోబర్‌లోనే కాకుండా మార్చ్ 2024లో కూడా ఈ ప్రమాదం జరగడానికి 0.0000096 శాతం అవకాశం ఉంది.
ఒకవేళ 2007 ఎఫ్‌టీ3 కనుక భూమిని ఢీకొడితే అది 2.6 బిలియన్ టన్నుల టీఎన్‌టీ పేలుడు పదార్థం సృష్టించిన విధ్వంసానికి సమానంగా వినాశనం సృష్టిస్తుంది. ఒక వేళ ఇదే కనుక జరిగితే అది ఢీ కొట్టిన చుట్టు పక్కల ప్రాంతమంతా నాశనం అవుతుంది. అయితే భూమిని మొత్తాన్ని నాశనం చేసేంత శక్తి ఈ ఆస్టరాయిడ్‌కు లేదు.
దీని తర్వాత భూమిపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉన్న మరో ఆస్టరాయిడ్.. 29075 (1950 డీఏ). ఇది భూమిని ఢీకొట్టడానికి 0.0029 శాతం అవకాశం ఉంది. అంటే 34500 ప్రయత్నాల్లో ఒక సారి మాత్రమే అలా జరగొచ్చు. 2880, మార్చ్ 16న ఈ ప్రమాదం సంభవించొచ్చని నాసా వెల్లడించింది.
