మన పాలపుంత ఎంత అందంగా ఉందో చూశారా? ఫొటో విడుదల చేసిన నాసా
విశ్వ శోధనకు నాసా (NASA) పంపిన జేమ్స్ టెలిస్కోప్.. మానవుడు ఇది వరకు చూడని అంతరిక్ష అద్భుతాలను శాస్త్రవేత్తలకు పంపుతోంది. తాజాగా మన పాలపుంతలోని మధ్య భాగాన్ని ఫొటో తీసింది.

విధాత: విశ్వ శోధనకు నాసా (NASA) పంపిన జేమ్స్ టెలిస్కోప్.. మానవుడు ఇది వరకు చూడని అంతరిక్ష అద్భుతాలను శాస్త్రవేత్తలకు పంపుతోంది. తాజాగా మన పాలపుంతలోని మధ్య భాగాన్ని ఫొటో తీసింది. ఈ ఫొటోను అభివృద్ధి చేసిన నాసా.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనిని చూసి అంతరిక్ష ప్రేమికులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
మన మిల్కీ వే గెలాక్సీ (Milky Way Galaxy) ఇంత అందంగా ఉంటుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రాంతాన్ని ఇది వరకు ఒక సారి ఫొటో తీసినప్పటికీ అది ఇంత స్పష్టంగా లేదని నాసా పేర్కొంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ .. దీనిని అత్యంత స్పష్టతతో చిత్రించి పంపిందని తెలిపింది.
చిత్రంలో కనిపిస్తున్న ఈ మిల్కీ వే గెలాక్సీలోని ప్రాంతంలో సుమారు అయిదు లక్షల నక్షత్రాలున్నాయని నాసా పేర్కొంది. ఇందులో ప్రోటో స్టార్ క్లస్టర్‌లు, భారీ మొత్తంలో ధూళి, గ్యాస్ పదార్థాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా మన సూర్యుని కంటే పరిమాణంలో 30 రెట్ల ఎక్కువైన నక్షత్ర మండలాలు కూడా ఆ చిత్రంలో ఉన్నాయి.
గెలాక్సీ మధ్య భాగంలో ఉన్న భారీ కృష్ణ బిలానికి 300 కి.మీ. దూరంలో ఈ సిగాటారియస్ సి అనే ఈ నక్షత్ర జనన మండలం ఉంది. వెబ్ టెలిస్కోప్ అరుదైన విషయాలను, ఫొటోలను మనకు అందిస్తోంది. నక్షత్ర జనన క్రమాన్ని మరింత లోతుగా విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫొటో గతంలో ఎప్పుడూ చూడనిది అని నాసా శాస్త్రవేత్త శామ్యూల్ క్రోవే అన్నారు. నక్షత్రాల పుట్టుక గురించి ఇప్పటి వరకు ఉన్న సిద్ధాంతాలను ఈ ఫొటో ప్రశ్నిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
'ఈ ప్రక్రియకు కావాల్సిన గ్యాస్, ధూళి అక్కడ ఎలా ఉద్భవిస్తోందో తెలుసుకోవాలి. ప్రోటోస్టార్‌లు చిన్న చిన్న నిప్పు గోళాలను విడుదల చేస్తున్నట్లు ఫొటోను చూస్తు తెలుస్తోంది. అవి ఏంటో కనుక్కోవాలి. జేమ్స్ టెలిస్కోప్ టన్నుల కొద్దీ సమాచారాన్ని నాసాకు పంపింది. వాటిని విశ్లేషించి అసలు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది' అని ఆయన అన్నారు.
