అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌) నుంచి అంత‌రిక్షంలోకి జారిపోయిన శాస్త్రవేత్త‌ల టూల్‌కిట్‌ (NASA Tool Bag) కు సంబంధించి నాసా (NASA) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది

విధాత‌: అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌) నుంచి అంత‌రిక్షంలోకి జారిపోయిన శాస్త్రవేత్త‌ల టూల్‌కిట్‌ (NASA Tool Bag) కు సంబంధించి నాసా (NASA) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ కిట్‌ మంగ‌ళ‌వారం (న‌వంబ‌ర్ 21న‌) భూమిపై ఉన్న‌వారికి క‌నిపిస్తుంద‌ని తెలిపింది.

అయితే బ్రిట‌న్ వాసుల‌కే ఈ అదృష్టం ద‌క్క‌నుంది. వారు ఉన్న ప్రాంతంపైకి మంగ‌ళ‌వారం అది ద‌గ్గ‌ర‌గా రానుండ‌టంతో ఎటువంటి ప్ర‌త్యేక ప‌రిక‌రాల సాయం లేకుండా ప్ర‌తి ఒక్కరూ దానిని చూడొచ్చ‌ని శాస్త్రవేత్త‌లు పేర్కొంటున్నారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం 5:30 నుంచి 5:41ల మ‌ధ్య ఆకాశంలో ప్ర‌కాశిస్తూ టూల్ కిట్ ప్ర‌యాణిస్తుంద‌ని తెలిపారు. అయితే ఆ స‌మ‌యంలో ఆకాశం నిర్మ‌లంగా ఉంటేనే ఆ వ‌స్తువును చూడ‌గ‌ల‌మ‌ని.. బైనాక్యుల‌ర్స్‌, టెలిస్కోప్ ఉంటే ఇంకా మంచిద‌ని స్పేస్ (Space) ఔత్సాహికులు చెబుతున్నారు.

ఎలా మిస్ అయింది?

ఈ నెల 2వ తారీఖున నాసా కు చెందిన ఈ టూల్ కిట్‌ను ఐఎస్ఎస్ (ISS) శాస్త్రవేత్త‌లు అంత‌రిక్షంలో పోగొట్టుకున్నారు. ఆస్ట్రోనాట్‌లు జాస్మిన్ మోఘ్‌బెలి, లోరల్ ఓ హ‌రాలు అంత‌రిక్ష కేంద్రానికి ఉండే సౌర ప‌ల‌కాల‌ను మ‌ర‌మ్మ‌తు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకోసం టూల్‌కిట్‌తో స‌హా ఐఎస్ఎస్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ టూల్ కిట్ వారి చేయి జారి అంతరిక్షంలోకి దూసుకుపోయింది.

దానిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం ప్ర‌మాద‌క‌రం కావ‌డంతో ఆస్ట్రోనాట్‌లు మిన్న‌కుండిపోయారు. ఇది భూమ్యాక‌ర్ష‌ణ ప‌రిధిలోనే ఉండ‌టంతో ఐఎస్ఎస్‌తో పాటే తిరుగుతోంది. దాని క‌న్నా అయిదు నిమిషాల ముందు ఇది ప్రయాణిస్తోందని నాసా పేర్కొంది. ఇది ఇలానే మ‌రొకొన్ని నెల‌ల పాటు భూమి చుట్టూ ప‌రిభ్ర‌మిస్తుంద‌ని నాసా శాస్త్రవేత్త గైన్‌లుకా మాసీ అభిప్రాయ‌ప‌డ్డారు.

అనంత‌రం ఇది 113 కి.మీ. కింద‌కు వ‌చ్చి భూ వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశిస్తుంద‌ని తెలిపారు. త‌ర్వాత‌ వాతావ‌ర‌ణ రాపిడికి మంట‌ల్లో చిక్కుకుని నాశ‌న‌మ‌య్యేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. ఐఎస్ఎస్ శాస్త్రవేత్త‌లు అంత‌రిక్షంలో టూల్ కిట్ పోగొట్టుకోవ‌డం ఇదే తొలిసారి కాదు. 2008, న‌వంబ‌రు 18న ఇదే త‌ర‌హా బ్యాగ్‌ను ఆస్ట్రోనాట్‌లు ప్ర‌మాద‌వ‌శాత్తు అంత‌రిక్షంలోకి జార‌విడిచారు.

Updated On
Somu

Somu

Next Story