12 గంటల పాటు నిలిచిపోయిన సిమ్ సిగ్నల్స్.. సంస్థ సీఈఓ రాజీనామా
కొన్ని గంటల పాటు సిమ్‌లు పనిచేయకుండా సిగ్నల్ అవుటేజ్ ఏర్పడటం.. ఓ టెలికాం సంస్థ సీఈఓ రాజీనామాకు దారి తీసింది

విధాత: కొన్ని గంటల పాటు సిమ్‌లు పనిచేయకుండా సిగ్నల్ అవుటేజ్ ఏర్పడటం.. ఓ టెలికాం సంస్థ సీఈఓ రాజీనామాకు దారి తీసింది. ఆస్ట్రేలియా (Australia)లో రెండో అతి పెద్ద నెట్వర్క్‌ను కలిగి ఉన్న ఆప్టస్ సంస్థలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ నెల మొదట్లో ఎక్కువ సమయం పాటు సిగ్నల్స్ నిలిచిపోవడం, గతేడాది కంపెనీ సర్వర్ల నుంచి డేటా చౌర్యం జరిగిందన్న ఆరోపణలు రావడం ఇలా అన్నీ కలిసి ఆ సంస్థ సీఈఓ కెల్లీ బేయర్ రోజ్‌మారిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా ఈ నెల మొదట్లో ఏర్పడిన సిగ్నల్ ప్రతిష్టంభన వల్ల సుమారు 12 గంటల పాటు ఆక్టస్ సిమ్‌లు పనిచేయడం మానేశాయి. దీంతో ఆ సమయంలో 2.6 కోట్ల మంది ఆస్ట్రేలియన్‌లు ఫోన్‌ను, ఇంటర్నెట్‌ను ఉపయోగించలేకపోయారు. దీనిపై సంస్థ పేరు కూడా పాతాళానికి పడిపోయిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ఏకంగా పార్లమెంటరీ కమిటీ విచారణ చేసింది. సిగ్నల్స్‌ను నిలిపివేయడానికి తాము ప్రణాళిక ఏమీ రూపొందించలేదని.. అది ఒక ప్రమాదమేనని ఆక్టస్ ఇంజినీర్లు కమిటీ ముందు ఒప్పుకొన్నారు.
దీంతో దేశ టెలికాం వ్యవస్థపై దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. ఇంటర్నెట్‌లోనూ, బహిరంగంగానూ వినియోగదారులు ఆక్టస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితులు రోజ్ రాజీనామాకు దారి తీసినట్లు తెలుస్తోంది. 'అతిపెద్ద టెలికం సంస్థకు అత్యున్నత స్థాయిలో సేవలందించడం ఒక గౌరవం. కానీ ఆ బాధ్యతల నుంచి వైదొలగడానికి ఇది సరైన సమయం.
వ్యక్తిగత పరివర్తనకు సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా. ఆక్టస్ ముందుకు వెళ్లడానికి కూడా ఇది దోహదపడుతుంది' అని రోజ్‌మారిన్ తన రాజీనామా ప్రకటనలో వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఆక్టస్ మాతృసంస్థ సింగపూర్ టెలికమ్యునికేషన్స్ స్పందించింది. 'కొవిడ్ ముందు కీలక బాధ్యతల్లోకి వచ్చి కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను బలపరిచారు. సంస్థ ఈ స్థాయికి రావడంలో రోజ్ పాత్ర అపూర్వం' అని తన ప్రకటనలో పేర్కొంది.
