• శతాబ్దాంతానికి 3 డిగ్రీల మేర పెరిగే ముప్పు!
  • కర్బన ఉద్గారాలు, గ్రీన్‌హౌస్‌ వాయువలను
  • తగ్గించుకునేందుకు ప్రపంచ దేశాల నిర్ణయం
  • కానీ.. 1.2శాతం పెరిగిన కర్బన ఉద్గారాలు

న్యూయార్క్‌: వేడి.. వేడి.. వేడి! రకరకాల కాలుష్యాలు, భారీ స్థాయిలో విడుదలవుతున్న కర్బన ఉద్గారాలతో మనం ఊహించిన దానికన్నా ముందే ముప్పు ముంచుకురాబోతున్నది. కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు ఆయా దేశాలు తమ లక్ష్యాలను పూర్తి స్థాయిలో అమలు చేసినప్పటికీ.. పెద్ద ఫలితం ఉండదని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పడు జరుగుతున్న దానికి మించిన కృషి లేకపోతే మనుగడే కష్టంగా మారిపోతుందని తేల్చి చెబుతున్నాయి. పారిశ్రామిక యుగం నాటి ఉష్ణోగ్రతలతో పోల్చితే.. ఈ శతాబ్దాంతానికి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉన్నదని ఐక్య రాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదిక హెచ్చరించింది. కర్బన ఉద్గారాల విడుదలను 28 శాతానికి పరిమితం చేయడం ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని, 42 శాతానికి తగ్గించడం ద్వారా 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని ఐక్య రాజ్య సమితి వాతావరణ కార్యక్రమానికి సంబంధించిన గ్యాప్‌ రిపోర్ట్‌-2023 పేర్కొన్నది.


‘బద్దలైన రికార్డు’ అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. ఐక్య రాజ్య సమితి చర్చల 28వ సెషన్‌ (కాప్‌ 28) దుబాయిలో జరుగనున్న నేపథ్యంలో ఈ నివేదిక విడుదలైంది. అయితే.. 2021-2022లోనే కర్బన ఉద్గారాల విడుదల 1.2 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ఆయా దేశాలు జాతీయ స్థాయిలో తాము చేపట్టాల్సిన అన్ని చర్యలనూ బేషరతుగా పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే 2.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలకు పరిమితం చేసే అవకాశం ఉంటందని నివేదిక పేర్కొన్నది. షరతులతో అమలు చేస్తే.. పారిశ్రామిక యుగం పూర్వపు ఉష్ణోగ్రతలు కంటే 2.5 డిగ్రీల సెల్సియస్‌ మేరకు పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది.

పారిస్‌ ఒప్పందం ప్రకారం.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుదలను 2 డిగ్రీలకు లోపే ఉంచాలని అన్ని దేశాలు ఒప్పందానికి వచ్చాయి. అదే సమయంలో దానిని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసేందుకు కృషి చేయాలని కూడా తీర్మానించాయి. పారిస్‌ ఒప్పందం తర్వాత గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించడంలో ఆయా దేశాలు ప్రగతి సాధించినప్పటికీ.. విధ్వంసకర, కోలుకోలేని ప్రభావాలను నివారించే క్రమంలో 1.5 డిగ్రీలకే గ్లోబల్‌ వార్మింగ్‌ను పరిమితం చేసే లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాయని నివేదిక పేర్కొన్నది. గ్లోబల్‌ వార్మింగ్‌ కేవలం 1.1 డిగ్రీల మేరకు పెరిగితేనే.. ప్రపంచం ఇప్పటికే మునుపెన్నడూ చూడని వేడిని, వరదలను, కార్చిచ్చులను, తుఫానులు, కరువులను చవిచూస్తున్నది. ఇక అది పరిమితం చేయాలనుకున్న 2 డిగ్రీలకో లేదా ముప్పుగా ముందుకు వచ్చే 3 డిగ్రీలకో చేరుకుంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండబోతున్నదో ఇట్టే ఊహించుకోవచ్చు.


అక్టోబర్‌ మొదలయ్యే నాటికే ఈ ఏడాది 86 రోజులు.. పారిశ్రామిక యుగం ముందు కాలంతో పోల్చితే 1.5 డిగ్రీల మేరకు అధిక నమోదయ్యాయి. సెప్టెంబర్ నెల.. చరిత్రలోనే ఎన్నడూ ఎరుగనంత వేడిని రికార్డు చేసింది. ఆ నెలలో ఏకంగా 1.8 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ‘ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలనే లక్ష్యాన్ని సాకారం చేయడం ఇంకా సాధ్యమేనని మనకు తెలుసు. దానికి చేయాల్సిందల్లా.. పర్యావరణ సంక్షోభానికి కారకమవుతున్న విషపురుగులైన శిలాజ ఇంధనం వంటివాటిని ఏరివేయడమే’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ చెప్పారు.

Updated On
Subbu

Subbu

Next Story