7.7 కోట్ల మంది ధనవంతులకు 550 కోట్ల మంది పేదలు సమానం.. పర్యావరణ మార్పుల్లో కొత్త కోణం!
కర్బన ఉద్గారాల విడుదలలో కూడా ఆర్థిక అసమానతలు (Economic Disparities on Environmental Change) పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆక్స్‌ఫాం (Oxfam) నివేదిక బయటపెట్టింది

విధాత: కర్బన ఉద్గారాల విడుదలలో కూడా ఆర్థిక అసమానతలు (Economic Disparities on Environmental Change) పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆక్స్‌ఫాం (Oxfam) నివేదిక బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచ జనాభాలో ఉన్న ఒక శాతం మంది ధనవంతుల కార్యకలాపాల వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలు.. మొత్తం పేదల్లో ఉన్న రెండు వంతుల మంది ప్రజల వల్ల విడుదలయ్యే ఉద్గారాలకు సమానమని ఆక్స్‌ఫాం కుండబద్దలు కొట్టింది.
ఇదే సంఖ్యాపరంగా చూస్తే 550 కోట్ల మంది భూగోళానికి ఎంత హాని చేస్తున్నారో అంతే హాని 7.7 కోట్ల మంది వల్ల కలుగుతోంది. క్లైమాట్ ఈక్వాలిటీ: ఏ ప్లానెట్ ఫర్ ద 99% అనే పేరుతో ఈ నివేదిక (Study) ను స్టాక్‌హోం ఎన్విరాన్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది. 2019 వరకు జరిపిన వివిధ అధ్యయనాలను విశ్లేషించి పర్యావరణ మార్పులకు ఆర్థిక అసమానతలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ నివేదికలో పొందుపరిచారు.
దీని ప్రకారం.. ప్రపంచజనాభాలో ఒక శాతం ఉన్న ధనవంతులు సుమారుగా 7.7 కోట్ల మంది అనుకుంటే వారి కార్యకలాపాలు, జీవనశైలి వల్ల 16 శాతం కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇది జనాభాలో 66 శాతంగా ఉన్న 550 కోట్ల మంది పేదల వల్ల విడుదలయ్యే మొత్తానికి సమానం. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ అసమానతలు మరింత స్పష్టంగా ఆందోళనకరంగా ఉంటాయని నివేదిక రూపకర్తలు చెబుతున్నారు. ఉదాహరణకు ఫ్రాన్స్‌నే తీసుకుంటే ఒక పదేళ్లలో పేదవారు వెలువరించే కర్బన ఉద్గారాలను ఒక శాతం ధనవంతులు ఒక సంవత్సరంలోనే విడుదల చేసేస్తున్నారు.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ హ్యాండ్‌బాగ్‌ల బ్రాండ్ లూయిస్ వూటన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్... ఆ దేశానికే చెందిన ఒక సామాన్యుడి కంటే 1270 రెట్లు అధిక కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను కలిగి ఉన్నారు. దీనిని బట్టి పర్యావరణానికి నష్టం చేయడంలో పేదలు, ధనికుల పాత్రల మధ్య ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆక్స్‌ఫాం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని దారికి తీసుకురావడానికి పర్యావరణవేత్తలు కొన్ని సూచనలు చేస్తున్నారు.
తరచుగా విమానాల్లో తిరిగే వారిపై అధిక పన్ను వేయడం, పర్యావరణంపై పెట్టుబడులు చూపే ప్రభావాన్ని ప్రాతిపదికగా తీసుకుని వ్యాపారులపై గ్రీన్ ట్యాక్సులు వేయడం మొదలైనవి ఆ సూచనల్లో ప్రధానమైనవి. అంతే కాకుండా దేశాల ప్రభుత్వాలు పర్యవరణ అంశంపై విధివిధానాలు రూపొందించేటప్పుడు ఈ అసమానతలను దృష్టిలో పెట్టుకోవాలని నివేదికను రూపొందించిన మ్యాక్స్ లాసన్ పేర్కొన్నారు.
