HomeLatest newsమొత్తానికి.. 'ఖిలాడి'ని నిలబెట్టారు

మొత్తానికి.. ‘ఖిలాడి’ని నిలబెట్టారు

విధాత‌, సినిమా : ‘ఖిలాడి’ ఏంటి? కంటనీరు తుడవమేంటి? అసలేం అర్థం కాలేదు కదా.. డైరెక్ట్‌గా విషయంలోకి వస్తే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా.. రమేశ్‌వర్మ దర్శకత్వంలో నిర్మాత కోనేరు సత్యన్నారాయణ ‘ఖిలాడి’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూసింది.

కానీ బడ్జెట్ పరంగా మాత్రం.. ఇప్పటి వరకు రవితేజ కెరీర్‌లోనే లేనంతగా.. భారీ బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కించారు. విడుదల కూడా అట్టహాసంగా చేశారు. కానీ, కంటెంట్ కంటే.. కన్ఫ్యూజనే ఎక్కువగా ఉన్న ఈ సినిమా.. విడుదలైన మొదటి ఆటకే బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. దీంతో, మరో ఫ్లాప్ రవితేజ అకౌంట్‌లో పడింది. ఇది అందరికీ తెలిసిన విషయమేగా.. మరి కంటితుడుపు మ్యాటరేంటి? అనుకుంటున్నారా? వస్తున్నాం.. ఆ విషయంలోకే వస్తున్నాం.

ఈ సినిమాని రీసెంట్‌గా ‘స్టార్ మా’ ఛానల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రీమియర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరీ గొప్పగా కాదు కానీ.. పర్లేదు అనేలా వీక్షించారు. అదే ఈ సినిమాకి సంబంధించి కాస్త కంటితుడుపు చర్యగా ఇండస్ట్రీ అభివర్ణిస్తుంది. ఈ సినిమా 7కి పైగా టీఆర్పీని సాధించినట్లుగా తాజాగా రివీల్ చేశారు.

ఈ తరహా కన్ఫ్యూజ్ సినిమాలకు.. ఇంత రేటింగ్ రావడమంటే సామాన్య విషయం కాదు. ఈ రేటింగ్ రావడానికి కారణం ఖచ్చితంగా ఇందులోని హీరోయిన్సే.. అనేలా కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుండటం విశేషం. ఎందుకంటే.. ఇందులో నటించిన ఇద్దరు హీరోయిన్లు, అలాగే యాంకర్ అనసూయ కూడా హాట్‌హాట్‌గా కనిపించి, సక్సెస్ సంగతి పక్కన పెడితే.. కాస్త వార్తల్లో మాట్లాడుకునే సినిమాగా చేశారు.

ఇప్పుడదే ఈ సినిమాకి టెలివిజన్ ప్రీమియర్‌లో పరువు దక్కేలా చేసింది. మాములుగా అయితే.. ఇది అంత పెద్దగా చెప్పుకునే టీఆర్పీ కానే కాదు కానీ.. వెండితెరపై భారీ పరాజయాన్ని చవిచూసిన సినిమాని.. బుల్లితెరపై ప్రేక్షకులు ఆ మాత్రం పట్టించుకున్నారంటే.. నిజంగా ఇది చెప్పుకోవాల్సిన విషయమే.

ఏదైతేనేం.. బుల్లితెర సాక్షిగా ఈ ‘ఖిలాడి’ కాస్త కంటనీరు తుడిచాడు అనేది.. ఇప్పుడా టీమ్‌కి కూడా కాస్త హుషారునిస్తుంది. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్‌ ఆధ్వర్యంలో బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ నిర్మించాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!