Singareni |
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: సింగరేణి సంస్థ చేపడుతున్నరెండో దశ 232 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం కోసం మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా 10 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. వీటిలో టాటా సోలార్ పవర్ తో పాటు, ఎన్రిచ్ ఎనర్జీ, నోవాస్ గ్రీన్ ఇంజనీరింగ్, ఎర్త్ ఇన్ ప్రాజెక్ట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు భాగస్వామ్యమయ్యారు.
సింగరేణి చేపట్టనున్న సోలార్ ప్లాంట్ల నిర్మాణ విధివిధానాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సింగరేణి సోలార్ డైరెక్టర్ (ఈఅండ్ఎం) డీ సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వీకే శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (సోలార్) జానకిరామ్, ఇతర అధికారులు హాజరయ్యారు.
సింగరేణి సంస్థ 8 ఏరియాల్లో చేపట్టనున్న సోలార్ ప్లాంట్ల వివరాలను సింగరేణి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మొత్తం 232 మెగావాట్లకు సంబంధించి మూడు టెండర్లుగా నిర్మాణ ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ ప్రదేశాలు, అక్కడికి రవాణా సౌకర్యాలు నిర్మాణ ఏజెన్సీలు స్వయంగా పరిశీలించవచ్చని ఆహ్వానించారు.
సింగరేణి సంస్థ ఇప్పటికే తన మొదటి దశ 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో 224 మెగావాట్ల ప్లాంట్లను విజయవంతంగా పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సింగరేణి అధికారులు వివరించారు.
ఈనెల 25వ తేదీలోగా టెండర్లు సమర్పించాలని, టెండర్లు ఖరారైన తర్వాత కచ్చితంగా ఏడాది లోపు నిర్మాణాలు పూర్తి చేయాలని, నిర్మాణ దశలను బట్టి బిల్లులను ఎప్పటికప్పుడు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లిస్తామని సింగరేణి ఆర్థిక విభాగం అధికారులు వివరించారు.
సింగరేణి సంస్థకు పని చేయడం ఒక మంచి అవకాశంగా తాము భావిస్తామని ప్రీ బిడ్ కు విచ్చేసిన ఏజెన్సీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ (మెటీరియల్ ప్రొక్యూర్మెంట్) మల్లెల సుబ్బారావు, జనరల్ మేనేజర్ (ఎఫ్అండ్ ఏ) సుబ్బారావు, జనరల్ మేనేజర్ (వర్క్ షాప్స్) ఫ్రిజరాల్డ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్ వీకేవీరాజు పాల్గొన్నారు.