ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో 1760 కోట్లు పట్టుబడినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

- ఎన్నికల వేళ పట్టుబడిన సొమ్ము 659.2 కోట్లు
- ఐదు రాష్ట్రాల్లో మొత్తం 1760 కోట్లు స్వాధీనం
- గత ఎన్నికల కంటే 7 రెట్లు పెరుగుదల
- వివరాలు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో 1760 కోట్లు పట్టుబడినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. ఇందులో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణలో ఏకంగా 659.2 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో మద్యం, నగదు, డ్రగ్స్, విలువైన వస్తువులు, ఇతర తాయిలాలు కూడా కలిపి ఉన్నాయి. 650.7 కోట్లతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.
మధ్యప్రదేశ్‌లో 323.7 కోట్లు పట్టుబడగా.. ఛత్తీస్‌గఢ్‌లో 76.9 కోట్లు, మిజోరంలో 49.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 2018లో ఇదే ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల సమయంలో దొరికిన సొమ్ము 239.15 కోట్లు. అంటే.. ఈసారి పట్టుబడింది ఏడు రెట్లు అధికమని ఈసీ తెలిపింది. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని ప్రకటన పేర్కొన్నది. ఇంతకు ముందు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 1400 కోట్లు పట్టుకున్న విషయం తెలిసిందే. అది సదరు రాష్ట్రాలకు గతంలో జరిగిన ఎన్నికల సమయంలో పట్టుబడినదానికంటే 11 రెట్లు అధికం.
