All Parties
విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార, విపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ గత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములతో అధికార పీఠానికి దూరమైన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధించేందుకు గట్టి పోరాటమే చేస్తుంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెచ్చిన జోష్‌తో పాటు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పెద్దన్న పాత్రతో ఏర్పాటైన ఇండియా కూటమి పరిణామాలు ఒకవైపు, రాష్ట్ర పరిధిలో ప్రత్యర్థి పార్టీల నుంచి భారీగా సాగుతున్న చేరికలతో పెరిగిన గ్రాఫ్‌తో అసెంబ్లీ ఎన్నికల దిశగా కదనోత్సాహంతో సాగుతుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే ఎన్నికల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కూడా ఇన్‌చార్జీలను నియమించింది.
రేపు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీతో ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చ, నిర్ణయాలు చేయనుంది. ముఖ్యంగా అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక హామీలను జనంలోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలను చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బస్సు యాత్రల రూట్ మ్యాప్‌లను ఈ భేటీలో చర్చించి రూట్ల వారీగా బస్సు యాత్రల ఇన్‌చార్జీలను, క్యాంపెపయినర్ లీడర్లను ఖరారు చేయనుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామన్న దానిపై ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల హామీలకు తోడుగా మరిన్ని హామీలకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. వరంగల్, ఖమ్మం సభలలో రాహుల్ గాంధీ ద్వారా రైతు డిక్లరేషన్, చేయూత పింఛన్ డిక్లరేషన్లను, సరూర్‌నగర్ ప్రియాంక గాంధీ సభలో యూత్ డిక్లరేషన్ చేసిన ఆ పార్టీ త్వరలో జరగబోయే మహబూబ్‌నగర్ ప్రియాంకగాంధీ సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటించనుంది.
గాంధీభవన్ వేదికగా భూమి డిక్లరేషన్ ప్రకటించారు. విహెచ్ నేతృత్వంలో నిర్వహించబోయే పార్టీ బీసీ సదస్సులో బీసీ డిక్లరేషన్ వెల్లడించనుంది. అయితే ప్రకటించిన డిక్లరేషన్ స్కీమ్‌లతో పాటు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక హామీలను జనానికి మరింత చేరువ చేసేందుకు బస్సు యాత్రలను స్కీం భరోసా యాత్రలుగా మలిచి పార్టీ పథకాలపై విస్తృత ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతుంది.
సెప్టెంబర్ 17 నాటికి కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి ఎన్నికల ప్రణాళికను వెల్లడించాలని భావించినప్పటికీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున ఇప్పటికే ఇచ్చిన హామీలను ముందుగా జనంలోకి బస్సు యాత్రల ద్వారా తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది.
రెండు లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు 15వేల పెట్టుబడి సాయం, ఉపాధి హామీ పథకం కూలీలకు 12000, తెలంగాణ అమరుల కుటుంబాలకు 25 వేల పింఛన్, 4వేల నిరుద్యోగ భృతి, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యువతకు 10 లక్షల వడ్డీ లేని స్వయం ఉపాధి రుణాలు, ధరణి పోర్టల్ రద్దు, గిరిజన రిజర్వేషన్లు, పోడు భూముల క్రయవిక్రయాలపై చట్టబద్ధమైన కమీషన్ వంటి ఎన్నికల హామీలను బస్సు యాత్రల ద్వారా జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ రేపటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో కార్యాచరణ రూపొందించుకోనుంది.
అధికార బీఆర్ ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లకు ధీటుగా తెలంగాణలో అధికార సాధన లక్ష్యంగా కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారధ్యంలో దూకుడుగా వెళ్లాలని భావిస్తున్న బీజేపీ కోర్ కమిటీ జనాధరణ దిశగా వందరోజుల కార్యాచరణ నిర్దేశించుకుంది. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలను డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ఈనెల 24న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 25న ఇందిరా పార్కులో నిరసనలతో మొదలు పెట్టి, ఆగస్టు ఒకటి నుండి ఉదృతం చేసేందుకు నిర్ణయించారు.
అధికార టీఆర్ ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, దళిత వాడల్లో ప్రత్యేక సమావేశాలు నిర్ణయించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ, రెండు పడకల ఇండ్లు, కొత్త పింఛన్లు, బీసీలకు లక్ష సాయం, గల్ఫ్ బాధితులకు 500 కోట్ల సంక్షేమ నిధి, కొత్త రేషన్ కార్డులు, ధరణి వంటి అధికారపక్ష హామీల వైఫల్యాలపై బీఆర్ ఎస్‌ను ప్రజా కోర్టులో నిలబెట్టాలని పార్టీ కోర్ కమిటీ కార్యాచరణతో ముందుకెళుతుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో అధికారం నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ఉన్న అధికార బీఆర్ ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ బహుముఖ వ్యూహ తంత్రాలతో విపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. ఒకవైపు ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారాలను కొనసాగిస్తూనే.. ఇంకోవైపు కాంగ్రెస్, బీజేపీల రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టేందుకు గులాబీ నాయకత్వం కౌంటర్, డైవర్ట్ వ్యూహా రాజకీయాలతో ముందుకు వెళ్తుంది.
కొత్తగా ఇప్పటికే ఉన్న పథకాలకు తోడుగా బీసీ బంధు, గృహలక్ష్మీ, మైనారిటీ బంధు పథకాలను తెచ్చింది. త్వరలో బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీ పథకాలను బీసీల్లోకి మరింత గట్టిగా తీసుకెళ్లాలని బీఆరెస్ నిర్ణయించింది. రైతుల లక్ష రుణమాఫీ విషయం కూడా ఎన్నికల షెడ్యూల్ నాటికి తేల్చాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.
మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు జనాకర్షణ పథకాలపై రాజీలేని రీతిలో కేసీఆర్ దూకుడుగా వెళ్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాల క్రమంలో మిత్రపక్షం ఎంఐఎంతో విబేధాలున్నా వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగించే దిశగా కేసీఆర్ సుముఖంగా ఉన్నారు. ఇండియా కూటమి నేపధ్యంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా తమ పార్టీతోనే పొత్తు ఉండేలా సీట్ల కేటాయింపులపై కేసీఆర్ కీలక కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే సీపీఐ, సీపీఎంలకు చెరొక ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ సీట్లను ఇస్తామంటు బీఆరెస్ చేసిన ప్రతిపాదనలు నిరాశకు లోను చేయడంతో పొత్తుల విషయంలో ముందుకెళ్లాలా లేక కాంగ్రెస్ వైపు వెళ్లాలా..ఒంటరి పోరు చేయాలా అన్న అంశాలపై కమ్యూనిస్టులు మధన పడుతున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌లను నిలువరించడంలో బీఆరెస్ విరివిగా ప్రయోగిస్తున్న కౌంటర్, డైవర్ట్ పాలిటిక్స్ వ్యూహాలకు ఆ పార్టీ అధిష్టానం మరింత పదును పెడుతుంది.
ఇటీవల ధరణి, ఉచిత విద్యుత్తులపై కాంగ్రెస్ చేసిన విమర్శలపై ఎదురుదాడికి దిగిన బీఆరెస్ పార్టీ వాటిపైన ఎన్నికలకు వెలుదామంటు సవాల్ విసిరింది. క్షేత్ర స్థాయి నిరసనలతో హోరెత్తించింది. బీఆర్ఎస్‌ను తరుచు ఇబ్బందిపెడుతున్న లిక్కర్ స్కామ్, ఐటీ దాడులు వంటి ఇమేజ్ డామేజ్ పరిణామాల సందర్భంలో డైవర్ట్ పాలిటిక్స్ వ్యూహాలను తెరపైకి తెస్తు ప్రజల దృష్టిని మళ్లిస్తూ ముందు కెళుతుంది.
మరి ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ బలం పెరగడాన్ని గమనించిన బీఆర్ ఎస్ ముక్కోణపు పోటీల వాతావరణాన్నికొనసాగించేలా బీజేపీపై విమర్శలతో కేంద్ర ప్రభుత్వంపైన, విభజన హామీలపైన, ప్రాజెక్టుల అనుమతి వంటి అంశాలపైన రచ్చ రేపుతుంది. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న వ్యూహాప్రతి వ్యూహాల.. ఎత్తుకు పై ఎత్తు రాజకీయాల ఆటలో పైచేయి ఎవరిదన్నదానిపై ఎన్నికల వరకు ఆగాల్సిందే.