BRS | తొలిసారి కేసీఆర్‌, కేటీఆర్‌లకు అగ్నితో నిరసన

BRS ఇప్పటి వరకు పాలాభిషేకాలు, ధాన్యాభిషేకాలే.. వేములవాడలో నేతల ఫ్లెక్సీల దహనం విధాత: ‘‘ఇప్పటి వరకు ఒక ఎత్తు…. ఇక నుంచి మరొక ఎత్తు’’ అన్నట్లుగా తయారైంది బీఆర్ ఎస్‌ అధినేతల పరిస్థితి. ఇప్పటి వరకు పాలాభిషేకాలు, న్యాభిషేకాలను మాత్రమే చూసిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు మొదటి సారిగా నిరసనల సెగ తగులుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రాజ్యాధికారం అప్పగించారు. ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన నాయకుడిగా కేసీఆర్‌ […]

  • Publish Date - July 18, 2023 / 03:21 PM IST

BRS

  • ఇప్పటి వరకు పాలాభిషేకాలు, ధాన్యాభిషేకాలే..
  • వేములవాడలో నేతల ఫ్లెక్సీల దహనం

విధాత: ‘‘ఇప్పటి వరకు ఒక ఎత్తు…. ఇక నుంచి మరొక ఎత్తు’’ అన్నట్లుగా తయారైంది బీఆర్ ఎస్‌ అధినేతల పరిస్థితి. ఇప్పటి వరకు పాలాభిషేకాలు, న్యాభిషేకాలను మాత్రమే చూసిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు మొదటి సారిగా నిరసనల సెగ తగులుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రాజ్యాధికారం అప్పగించారు.

ఉద్యమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన నాయకుడిగా కేసీఆర్‌ తనను తాను ప్రమోట్‌ చేసుకున్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లుగా బీఆర్ ఎస్‌ అధికారంలో ఉంది. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో వ్యతిరేక ఉంటుంది. కానీ ఉద్యమాల నుంచి కేసీఆర్‌ రావడం వల్ల కావచ్చు… ఇప్పటి వరకు కేసీఆర్‌కు నిరసన సెగలు తగుల లేదు. పైగా ఉద్యోగులు, రైతులు, బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీల సంఘాలు, మైనార్టీలు, మహిళలు ఇలా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంఘాల నేతలు ఆయా పథకాలు ప్రకటించినప్పుడు పట్టణ కేంద్రాలతో పాటు ఊరూరా పాలాభిషేకాలు చేసేవారు.

బీఆర్ ఎస్‌ నేతలకు, కేసీఆర్‌, కేటీఆర్‌లకు పాలాభిషేకాలే అలవాటు అయ్యాయి. అధినాయకుడికి ఎక్కడా కూడా ఆగ్రహం రావద్దని క్యాడర్‌ భావించిందో ఏమో… ఏ కార్యక్రమం అమలైనా పాలాభిషేకాలు చేయడం అలవాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది.

అయితే కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్‌ తన సొంత జిల్లాగా భావించే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే నిరసన సెగలు తగిలాయి. మొదటి సారిగా వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం ముందు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఫ్లెక్సీలను కాంగ్రెస్‌ నేతలు దహనం చేయగం గమనార్హం.

ఇదిలా ఉండగా గన్నేరువరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను కాంగ్రెస్‌ నేతలు అడ్డుకొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నేతలు కేటీఆర్‌ దిష్టిబొమ్మను దగ్దం చేసే ప్రయత్నం చేశారు. ఇలా రాష్ట్రంలో మొదటి సారిగా కేసీఆర్‌, కేటీఆర్‌లకు నిరసన సెగలు తగులుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ బీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడంతో నిరసనలు, ఫ్లెక్సీల దగ్గం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి సారిగా సీఎం కేసీఆర్‌కు ప్రజల్లో వ్యతిరేకత‌ వెలువడుతున్నది అనడానికి ఈ పరిణామాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.