CM Stalin | చంద్రునిపైకి వెళ్లినా ఇంకా అవే భావాలా?: సీఎం స్టాలిన్
CM Stalin | అణచివేత సిద్ధాంతాలను వ్యతిరేకించడం సహించలేక పోతున్న కాషాయశక్తులు అందుకే ఆయన వ్యాఖ్యల వక్రీకరణ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి మద్దతు తమిళ, ఇంగ్లిష్ భాషల్లో సుదీర్ఘ ప్రకటన చెన్నై: సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న వ్యాఖ్యలతో బీజేపీ, కాషాయ శక్తుల నుంచి తీవ్ర దాడిని ఎదుర్కొంటున్న తన కుమారుడు, మంత్రి ఉదయనిధికి డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గట్టి మద్దతు పలికారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, […]

CM Stalin |
- అణచివేత సిద్ధాంతాలను వ్యతిరేకించడం
- సహించలేక పోతున్న కాషాయశక్తులు
- అందుకే ఆయన వ్యాఖ్యల వక్రీకరణ
- తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
- కుమారుడు ఉదయనిధికి మద్దతు
- తమిళ, ఇంగ్లిష్ భాషల్లో సుదీర్ఘ ప్రకటన
చెన్నై: సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న వ్యాఖ్యలతో బీజేపీ, కాషాయ శక్తుల నుంచి తీవ్ర దాడిని ఎదుర్కొంటున్న తన కుమారుడు, మంత్రి ఉదయనిధికి డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గట్టి మద్దతు పలికారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలపై వివక్ష చూపేలా సనాతన ధర్మం చెబుతున్న అమానవీయ సూత్రాల గురించే ఉదయనిధి మాట్లాడారని, అంతేకానీ ఏ మతాన్ని లేదా మత నమ్మకాలను నొప్పించే ఉద్దేశం అతనికి లేదని పేర్కొన్నారు.
ఈ మేరకు ఇంగ్లిష్, తమిళ భాషల్లో సుదీర్ఘ ప్రకటనను ఆయన గురువారం విడుదల చేశారు. కుల వివక్షను ప్రోత్సహిస్తున్న కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉదయనిధి మాట్లాడటాన్ని బీజేపీ అనుకూల శక్తులు సహించలేక పోతున్నాయని, అందుకే ఆయన ప్రసంగాన్ని వక్రీకరిస్తున్నాయని విమర్శించారు.
మహిళల అణచివేతకే సనాతన ధర్మం
మనం చంద్రయాన్‌ను విజయవంతం చేసినా ఇంకా కొందరు కుల వివక్షను వ్యాప్తి చేస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. వర్ణాశ్రమ ధర్మాల పేరుతో మహిళలు ఉద్యోగాలు చేయరాదని, వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోకూడదని వాదిస్తున్నారని అన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలను శాశ్వతంగా అణచివేసేందుకే సనాతన ధర్మం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి అణచివేతలకు వ్యతిరేకంగానే ఉదయనిధి మాట్లాడారని, అటువంటి సూత్రాల ఆధారంగా పాటించే ఆచారాలనే ఆయన నిర్మూలించాలన్నారని పేర్కొన్నారు.
బీజేపీ ట్రోల్ మూక అసత్య ప్రచారాలు
సనాతన ధర్మం ఆలోచనలు ఉన్నవారిని నిర్మూలించాలని ఉదయనిధి అన్నట్టు బీజేపీకి చెందిన ‘ట్రోల్ మూక’ అసత్యాలు ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ఆఖరుకు హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సైతం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ తలకు అయోధ్య ఆలయ ప్రధాన పూజారి పది కోట్లు వెల కట్టడంపైనా ఆయన మండిపడ్డారు.
‘దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకున్నదా? అని ప్రశ్నించిన స్టాలిన్.. దానికి బదులుగా ఉదయనిధిపైనే కేసులు పెట్టారని విమర్శించారు. ఉదయనిధి వ్యాఖ్యపై తగిన బదులివ్వాలని ప్రధాని చెప్పడాన్ని కూడా స్టాలిన్ తప్పుపట్టారు. ఉదయనిధి ఏమన్నారో తెలుసుకునే అవకాశం ప్రధానికి ఉన్నదని గుర్తుచేశారు. ‘అసత్య ప్రచారం తెలియకుండా ప్రధాని మాట్లాడుతున్నారా? లేక తెలిసీ మాట్లాడుతున్నారా?’ అని ప్రశ్నించారు.