Congress
విధాత: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలకు రంగం సిద్దమైంది. బీఆర్ ఎస్, బీజేపీలకు చెందిన డజనుకు పైగా సీనియర్ నేతలు ఈనెల 20వ తేదీన ఢిల్లీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేల సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆ నేతలతో ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు సంప్రదింపులు పూర్తి చేసినట్లు సమాచారం.
ఈ విషయాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చించడానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కొంతకాలంగా తమ పార్టీ అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఈ నేతలంతా పార్టీ మారడం తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది .
ఈ విషయాన్ని ఆ మధ్య తీగల కృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి, మందుల సామెల్, గద్వాల జడ్పీ ఛైర్ పర్సన్ సునీతలతో పాటు కన్మంత శశిధర్‌రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్టు చర్చ జరుగుతోంది.
వీరితో పాటు బీజేపీ నేతలు మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్, యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, రామారావు పటేల్ కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.