CPI Narayana | పురోగతిలోనే కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు: సీపీఐ నారాయణ

CPI Narayana విధాత: కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తుల చర్చలు పురోగతిలోనే ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం హైద్రాబాద్ అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంకు బండ్ పై మఖ్ధూం మొహినోద్ధిన్ విగ్రహం వరకు పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారాయణ దేశంలో ఇండియా కూటమి నాయకత్వాన కాంగ్రెస్ తో కలిసి సాగుతున్నామన్నారు. తెలంగాణలోనూ, ఇతర […]

  • By: Somu    latest    Sep 11, 2023 12:49 AM IST
CPI Narayana | పురోగతిలోనే కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు: సీపీఐ నారాయణ

CPI Narayana

విధాత: కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తుల చర్చలు పురోగతిలోనే ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం హైద్రాబాద్ అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంకు బండ్ పై మఖ్ధూం మొహినోద్ధిన్ విగ్రహం వరకు పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారాయణ దేశంలో ఇండియా కూటమి నాయకత్వాన కాంగ్రెస్ తో కలిసి సాగుతున్నామన్నారు.

తెలంగాణలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ అదే పద్దతిలో కొనసాగాలని అనుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్, ఎంఐఎంలు రెండు బీజేపీకి అనుకూలంగా మారడంతో పాటు తన కూతురును లిక్కర్ స్కామ్ నుంచి రక్షించుకోవడానికి రాజకీయ ఫిరాయింపు చేసిన సీఎం కేసీఆర్ ను ఇకమీదట నమ్మేది లేదన్నారు. కాంగ్రెస్ తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై చర్చలు కొలిక్కి రాలేదని, సీట్ల పంపిణీ ఇంకా జరుగలేదన్నారు.

దేశ వ్యాప్తంగా రాజ్యంగాన్ని, దేశాన్ని రక్షించండి… మోడీని ఓడించండన్న విధానంతో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో కలసి సాగుతున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ విమోచన వేడుకల పేరుతో, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట విజయాన్ని ముస్లిం వ్యతిరేక పోరాట విజయంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ ఇస్రో చంద్రయాన్ కు శివశక్తి పేరు పెట్టడం, జీ 20సదస్సుకు కమలం గుర్తు పెట్టుకుని రాజకీయం చేశారన్నారు.

చివరకు ఇండియాను భారత్ గా మార్చాలంటున్నాడని, ఇండియా కూటమి ఏర్పాటుతో బీజేపీ ఓటమి ఖాయమన్న భయంతో దేశం పేరు మార్పుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎంఐఎం, బీఆరెస్ లు బీజేపీకి అనుకూల ఎత్తుగడలు అనుసరిస్తున్నాయని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా ఇందుకు వాడుకుంటున్నారన్నారు. సాయుధ పోరాటానికి నిజమైన వారసులు ఎర్ర జెండా వాళ్లెనన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని ప్రభుత్వం పరంగా నిర్వహించాలని, కర్ణాటక, మహారాష్ట్ర లలో చేస్తుంటే మీకెందుకు అభ్యంతరమని నారాయణ ప్రశ్నించారు.