Delhi Ordinance Bill | లోక్‌సభకు ఢిల్లీ బిల్లు

Delhi Ordinance Bill ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి మండిపడిన ప్రతిపక్షాలు ఢిల్లీ: తీవ్ర వివాదాస్పద అంశంగా ఉన్న ‘ఢిల్లీ రాజధాని ప్రాంత (సవరణ) బిల్లు- 2023ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద పెట్టున నినదించాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో ఢిల్లీలో ప్రజాస్వామ్యం బదులు అధికార స్వామ్యం నెలకొంటుందని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలలో ఢిల్లీ గవర్నర్‌కు ఈ బిల్లు […]

  • Publish Date - August 1, 2023 / 12:28 AM IST

Delhi Ordinance Bill

  • ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
  • ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి
  • మండిపడిన ప్రతిపక్షాలు

ఢిల్లీ: తీవ్ర వివాదాస్పద అంశంగా ఉన్న ‘ఢిల్లీ రాజధాని ప్రాంత (సవరణ) బిల్లు- 2023ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద పెట్టున నినదించాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో ఢిల్లీలో ప్రజాస్వామ్యం బదులు అధికార స్వామ్యం నెలకొంటుందని ఆరోపించారు.

ఢిల్లీ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలలో ఢిల్లీ గవర్నర్‌కు ఈ బిల్లు సర్వాధికారాలు కట్టబెడుతుంది. ఇప్పటికే ఈ విషయంలో మే 19న తెచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో ఈ బిల్లు తెచ్చారు. ఢిల్లీ పరిపాలనా వ్యవహారాల్లో ప్రభుత్వానికే అధికారాలు కట్టబెడతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వ చర్యను ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. పార్లమెంటులో బిల్లు పత్రాలు ప్రవేశపెట్టడం అత్యంత అప్రజాస్వామిక చర్యే కాకుండా, చట్ట విరుద్ధమని ఆప్‌ పేర్కొన్నది. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిరస్కరించారు. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ.. ఢిల్లీ విషయంలో చట్టాలు చేసేందుకు రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చిందని తెలిపారు.

బిల్లుకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలన్నీ రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నవేనని అన్నారు. ఈ బిల్లును లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ చౌదరి వ్యతిరేకించారు. ఇది రాష్ట్రాల వ్యవహారాల్లో చొరబడటమేనని అన్నారు. సహకార సమాఖ్యవాదాన్ని బొందబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నమేనని విమర్శించారు. గతంలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ కంటే దారుణంగా కొత్త బిల్లు ఉన్నదని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా అన్నారు.

అంతేకాకుండా ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, ఢిల్లీ ప్రజలకు ఇది వ్యతిరేకంగా ఉన్నదని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలన్నింటినీ ఈ బిల్లు లాగసుకుని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు, అధికారులకు అప్పగిస్తుందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం స్థానంలో అధికారస్వామ్యాన్ని తీసుకురావడమేనని విశ్లేషించారు. ఇదిలా ఉంటే.. బిల్లను బీజేడీ సమర్థించింది. ఇది బీజేపీకి ఎంతో ఉపకరించనున్నది. రాజ్యసభలో మెజార్టీ లేని ఎన్డీయే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేందుకు బీజేడీ 9 మంది సభ్యుల మద్దతు సహాయపడనున్నది.