Gangula Kamalakar | గంగుల ‘గోవింద’ నామ స్మరణ.. వచ్చే ఎన్నికల్లో ఏడుకొండల వెంకన్న పైనే భారం
Gangula Kamalakar ఎంఐఎం పోటీ చేస్తామనడంతో రూటు మార్చిన మంత్రి ఖాయంగా కనిపిస్తున్న మైనారిటీ ఓట్ల చీలిక బండిని ఎదుర్కోవాలంటే గోవిందుని భజన తప్పట్లేదు ప్రత్యర్ధులు ఎవరో తెలియకపోయినా, మంత్రి ఉరుకులు, పరుగులు విధాత, బ్యూరో కరీంనగర్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో వివిధ రాజకీయ పక్షాలు ప్రజల 'నాడి' పట్టే ప్రయత్నంలో పడ్డాయి. రాజకీయ ఉద్దండులు ఎందరో ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో అప్పుడే ఓట్ల రాజకీయాలు ఊపందుకున్నాయి. […]

Gangula Kamalakar
- ఎంఐఎం పోటీ చేస్తామనడంతో రూటు మార్చిన మంత్రి
- ఖాయంగా కనిపిస్తున్న మైనారిటీ ఓట్ల చీలిక
- బండిని ఎదుర్కోవాలంటే గోవిందుని భజన తప్పట్లేదు
- ప్రత్యర్ధులు ఎవరో తెలియకపోయినా, మంత్రి ఉరుకులు, పరుగులు
విధాత, బ్యూరో కరీంనగర్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో వివిధ రాజకీయ పక్షాలు ప్రజల ‘నాడి’ పట్టే ప్రయత్నంలో పడ్డాయి. రాజకీయ ఉద్దండులు ఎందరో ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో అప్పుడే ఓట్ల రాజకీయాలు ఊపందుకున్నాయి.
1952 నుండి 2018 వరకు 15 సార్లు ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే, ఆరుగురు మినహా
ఇక్కడి నుండి గెలుపొందిన వారందరూ వెలమ కులస్తులే. వెలమల కంచుకోట లాంటి ఈ నియోజకవర్గ రాజకీయాల్లో 2009 నుండి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2009, 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో వారి ఆధిపత్యానికి గండి పడింది. వెలమల కంచుకోట బీసీల పరమైంది.
కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 3,21,758 ఓటర్లు ఉండగా, వీరిలో 1,61,767 మంది పురుషులు, 1,59,970 మంది మహిళలు. కరీంనగర్ పట్టణం, కొత్తపల్లి మండలం ఈ నియోజకవర్గంలో అంతర్భాగం. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ ఫలితాలను శాసించడంలో మైనార్టీలు, క్రిస్టియన్లు, మున్నూరు కాపు, పద్మశాలి, ముదిరాజ్ లదే ప్రధాన పాత్ర.
ఉత్తర తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న కరీంనగర్ నియోజకవర్గంపై పట్టు సాధించడంపై ప్రస్తుతం ప్రధాన రాజకీయ పక్షాలన్నీ దృష్టి సారించాయి. పదిహేను సార్లు కరీంనగర్ శాసనసభకు ఎన్నికలు జరిగితే 1952, 1962 మినహా, మిగిలిన ఎన్నికలు నాటి కాలానుగుణ పరిస్థితులకే జై కొట్టాయి.
ఈ శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి విజయం సాధిస్తే, మూడో ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి విజయకేతనం ఎగిరేశారు. ఆ తరువాత ఐదు సార్లు కాంగ్రెస్, మరో ఐదు సార్లు తెలుగుదేశం, ఓ పర్యాయం స్వతంత్ర అభ్యర్థి, రెండు పర్యాయాలు టిఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడి నుండి విజయం సాధించారు.
ఈసారి కీలకం..
కరీంనగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈసారి జరగబోయే ఎన్నికలు అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నాయి.
1957లో రాజకీయ ఉద్దండుడు జువ్వాడి చొక్కా రావు ఇక్కడి నుండి గెలుపొందారు. 1962 లో ఆయన విజయానికి బ్రేక్ పడింది. అయితే తిరిగి 1967, 1972 ఎన్నికల్లో చొక్కారావు గెలుపొంది, మూడుసార్లు గెలుపొందిన రికార్డును మూడు దశాబ్దాల పాటు కాపాడుకోగలిగారు.
ఈ రికార్డును గంగుల కమలాకర్ బద్దలు చేశారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి, ఆ తరువాత టిఆర్ఎస్ లో చేరి 2014, 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుండి వరుసగా గెలుపొందిన గంగుల హ్యాట్రిక్ సాధించారు.
మరో విజయం కోసం..
హ్యాట్రిక్ శాసనసభ్యునిగా, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్
మరో విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. గత మూడు ఎన్నికల్లోను ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, మున్నూరు కాపులు ఆయన విజయానికి దోహదపడ్డారు. ఈ నియోజకవర్గంలో సుమారుగా 45 వేల ముస్లిం మైనార్టీ ఓటర్లు, 8వేల క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు, 34 వేల మున్నూరు కాపు ఓటర్లు, 28 వేల పద్మశాలి ఓటర్లు, 21 వేల ముదిరాజ్ ఓటర్లు ఉన్నారు.
ముస్లిం మైనారిటీ ఓట్లకు గండి..
గత మూడు ఎన్నికల్లోను మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ( ఎంఐఎం) అధికార పార్టీకి బీ టీంగా పనిచేస్తూ వచ్చింది. అయితే రాబోయే ఎన్నికల్లో ఆ బంధం కొనసాగింపు సాధ్యపడకపోవచ్చు. ఇప్పటికే ఎంఐఎం నేతలు కరీంనగర్ నుండి పోటీకి సిద్ధమని సవాళ్లు విసురుతున్నారు.1000 కోట్ల విరాళాలు సేకరించైనా సరే, అధికార పార్టీపై పోటీకి సిద్ధమని బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఈ పరిణామం మైనార్టీ ఓట్లలో చీలికకు దారితీస్తుందే మోననే ఆందోళన గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది.
మూడు నామాలే గట్టెక్కిస్తాయా…
కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు చీలిపోవడం ఖాయంగా కనిపిస్తుండడంతో, మంత్రి గంగుల కమలాకర్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. మైనారిటీల సంతుష్టికరణ
పక్కన పెట్టి ‘హిందుత్వ’ ఓటు బ్యాంకుపై కన్నేశారు. నాలుగవ విజయం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
గత మూడేళ్లుగా వరుసగా మార్కెట్ రోడ్డులో శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తూ వస్తున్న మంత్రి గంగుల కమలాకర్, ఏకంగా టిటిడి ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయ నిర్మాణానికి తన రాజకీయ పలుకుబడిని అంతా ఉపయోగించారు. పది ఎకరాల స్థలంలో టీటీడీ కేటాయించిన 20 కోట్ల నిధులతో తిరుమల వెంకన్న ఆలయ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ నిర్వహించారు.
కరీంనగర్ లో కాషాయ దళం దూకుడుకు బ్రేక్ వేయడానికి, హిందూ ఓట్లు కొల్లగొట్టడానికి ఆయన వెంకన్ననే నమ్ముకున్నారు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ప్రత్యర్ధులు ఎవరన్నది తేలకపోయినా, మంత్రి గంగుల సెక్యులర్ బాట నుండి, హిందుత్వ ఎజెండా వైపు మళ్లడం మరో విజయానికి మార్గం సుగమం చేసుకోవడమే.. అనుకుంటున్న వారు లేకపోలేదు.
బండి బాటేమిటో..
రాష్ట్ర రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోకసభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ శాసనసభకు పోటీ చేస్తారా? లేక లోకసభ సభ్యునిగా కొనసాగుతారా? అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 2014, 2018 ఎన్నికల్లో కరీంనగర్ నుండి శాసనసభకు పోటీ చేసిన సంజయ్ ఓటమి చవి చూశారు. అయితే ఆయన కరీంనగర్ ను హిందుత్వ వాదులకు అడ్డాగా తీర్చిదిద్దారు.
గత లోకసభ ఎన్నికల ప్రచార సందర్భంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కరీంనగర్ బహిరంగ సభలో హిందువులను ఉద్దేశించి ‘ హిందూ గాళ్లు బొందు గాళ్లు’ అంటూ చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టి శాసనసభ ఎన్నికల్లో అందుకోలేని అనూహ్య విజయాన్ని లోకసభ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ కి కల్పించాయి.
కరీంనగర్ జ్యోతి నగర్ లో మహాశక్తి ఆలయం నిర్మించి అక్కడ హిందూ పండగల సందర్భంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్న సంజయ్, ప్రత్యేక హనుమాన్ జయంతి సందర్భంగా
హిందువులను ఐక్యం చేసేందుకు భారీ ఎత్తున ఏక్తా యాత్రలు చేపడుతున్నారు. దీంతో బిజెపి ఫైర్ బ్రాండ్ ను ఎదుర్కొనేందుకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల గోవింద నామస్మరణ చేయక తప్పడం లేదు.
కాంగ్రెస్ మాటేమిటి..
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఈ నియోజకవర్గంలో ప్రజల మొగ్గు కాంగ్రెస్ వైపు కనిపిస్తుందని కొన్ని సర్వే సంస్థలు తేల్చిన నిజం. పార్టీకి సరైన అభ్యర్థి లేకున్నా, ప్రజలు మాత్రం ఒకింత అటువైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. గత ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసి ఓటమి చవిచూసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరో మారు శాసనసభకు పోటీ చేయడానికి నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. అయితే అనేకమంది ఆశావహులు కాంగ్రెస్ టికెట్ కోసం పార్టీ అధిష్టానం వద్ద ఇప్పటికే క్యూ కడుతున్నారు.
ఉద్ధండులెందరో..
కరీంనగర్ నుండి రాజకీయ ఉద్దండులైన జువ్వాడి చొక్కా రావు, మెన్నేని సత్యనారాయణరావు, వెలిచాల జగపతిరావు, చలిమెడ ఆనందరావు ప్రాతినిధ్యం వహించారు. వీరంతా ఈ నియోజకవర్గ ప్రజల్లో క్లీన్ ఇమేజ్ సాధించారు. అయితే మూడుసార్లు గెలుపొంది మంత్రి పదవి చేపట్టిన గంగుల కమలాకర్ తనకోటరీ కారణంగా అటు పార్టీ వర్గాలలో, ఇటు ప్రజల్లో అపప్రద ఎదుర్కొంటున్నారు.
గ్రానైటు, ఇసుక, కాంట్రాక్ట్ పనుల్లో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, భూకబ్జాదారుల కనుసన్నల్లో నడుస్తున్నారని ప్రత్యక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన ఇప్పుడిప్పుడే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.
- 1952 నుండి గెలుపొందింది వీరే..
- 1952 సిహెచ్ వెంకట రామారావు, పిడిఎఫ్
- 1957 జువాడి చొక్కా రావు, కాంగ్రెస్
- 1962 ఏ కిషన్ రెడ్డి. సోషలిస్ట్
- 1967 జువ్వాడి చొక్కా రావు, కాంగ్రెస్
- 1972 జువ్వాడి చొక్కా రావు, కాంగ్రెస్
- 1978 నలుమాచు కొండయ్య, కాంగ్రెస్ ఐ
- 1983 కటకం మృత్యుంజయం, సంజయ్ విచార్ మంచ్
- 1985 చలి మెడ ఆనందరావు, తెలుగుదేశం
- 1989 వెలిచాల జగపతిరావు,స్వతంత్ర
( ఈయన 1972 లో జగిత్యాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకు గెలుపొందారు) - 1994 జువ్వాడి చంద్రశేఖర రావు, తెలుగుదేశం
- 1999 కటారి దేవేందర్రావు, తెలుగుదేశం
- 2004 మెన్నేని సత్యనారాయణ రావు, కాంగ్రెస్
- 2009 గంగుల కమలాకర్, తెలుగుదేశం
- 2014 గంగుల కమలాకర్, టిఆర్ఎస్
- 2018 గంగుల కమలాకర్, టిఆర్ఎస్