Haryana
న్యూఢిల్లీ: మణిపూర్ లో మండుతున్న జ్వాలలు ఇంకా ఆరనేలేదు. ప్రపంచమంతా మణిపూర్ లోశాంతి స్థాపన కొరకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు బాధ్యత మరిచి గాఢ నిద్ర నటిస్తున్నాయి. మరో వైపు ఢిల్లీ సమీపంలోని హర్యానాలో తాజాగా గత సోమవారం రెండు వర్గాల మధ్యచెలరేగిన హింస, అల్లర్లు, హత్యలు ఇంకా ఉదృతమవుతున్నాయి. క్రమంగా చుట్టు పక్కన రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటికే ఐదుగురు వ్యక్తులకు పైగా చనిపోయారని వార్తలొస్తున్నాయి. మందిర్, మసీద్‌లకు నిప్పంటించారు. వాహనాలు, దుకాణాలు కాలి బూడిదయ్యాయి. నష్టాలు కోట్లను దాటుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు కర్ప్యూ విధించి పరిస్థితిని అదుపు చేయ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఉన్నట్టుండి ఈ అల్లర్లు చెలరేగడానికి గల కారణాలు, సంబంధిత చర్చలు ఇప్పటికే మీడియా ద్వారా ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి.
మణిపూర్ హింసాకాండపై బీజేపీ అనుసరించిన పాలసీ దేశ వ్యాప్తంగా ప్రజల వ్యతిరేకతకు గురైంది. ప్రతిపక్షాలు బీజేపీని ఎండగడుతున్న తీరుకు ప్రజల్లో బలం పెరుగుతున్నది. దేశ వ్యాప్తంగా ఎదురవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించి రాబోయే ఎన్నికల్లో హిందుత్వాన్నితిరిగి ఎజెండాలోకి తెచ్చేందుకే బీజేపీ హర్యానాలో అల్లర్లకు ఆజ్యం పోసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హర్యానాలో బీజేపీ రెండవ సారి అలయెన్స్ ద్వారా అధికారంలోకి వచ్చింది. దక్షిణ హర్యానా లోని గుర్‌గ్రామ్, నూహా, రెవారీ జిల్లాల్లోని ఈ ప్రాంతాల్లో సోమవారం విశ్వహిందూపరిషత్, భజరంగదళ్ ల శ్రావణపూర్ణిమ జలాభిషేకం ఊరేగింపు వుంది. ఈ ఊరేగింపు ప్రచారం బాగా ముందునుండే జరిగింది. ఈ ప్రాంత భజరంగ్ దళ్ నాయకుడు మోను మనేసర్ నాయకత్వంలోఊరేగింపు సాగుతుందనేది కూడా బాగా ప్రచారమైంది. ఈ ఊరేగింపు సందర్భంగానే అల్లర్లు, హింస మొదలైంది.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ లు అల్లర్లకు కారణంగా ముస్లీం మైనార్టీ యువకులు కొంతమంది ఊరేగింపుపై రాళ్ళురువ్వడంతో అది హింసాత్మకంగా మారిందని ఆరోపించారు. హర్యానా ఉపముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా ఊరేగింపు కొరకు జిల్లా ప్రభుత్వంనుండి సరైన అనుమతి పొందలేదని విమర్శించారు. జిల్లా ప్రభుత్వానికి ఊరేగింపు సమాచారం కూడా లేదని ఆయన తన అసహనాన్ని వ్యక్తపరిచాడు. గుర్‌గ్రామ్ పార్లమెంట్ సీటు రెండసార్లు వరుసగా గెలిచిన సభ్యుడు, బీజేపీ కేంద్రమంత్రి రావ్ఇంద్రజిత్ సింగ్ అల్లర్లకు కారణం రెండువైపుల చూడడం మంచిదని హితబోధ చేశాడు. అంతేకాదు కత్తులు, బరిసెలు, నాటుతుపాకులు వంటి మారణాయుధాలు ధరించి ఊరేగింపు లో పాల్గొనటం చట్ట వ్యతిరేకం .ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిన కుట్ర అని కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.
అయితే నూహా అల్లర్ల వెనుక రాజకీయ కారణాలు కూడా వున్నాయనేది భివాణీ సామాజిక కార్యకర్త, దీపక్ కుమార్, మేవాడ్ ప్రాంత సీనియర్ జర్నలిస్టు మహేశ్ కుమార్ వేద్ తమ విశ్లేషణలో వివరించారు. మేవాడ్ ప్రాంతంలో అంటే రాజస్థాన్ , హర్యానా సరిహద్దుల్లోని నూహా, రెవారీ జిల్లా ఏరియాల్లో బీజేపీ పట్టు గత కొంతకాలం నుండి బలహీన పడుతున్నది. గతసంవత్సరం జరిగిన రైతుల ఆందోళన, రెజ్రరర్ల అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు , సైన్యంలోకి తాత్కాలిక భర్తీ అగ్నివీర్ పథకం వంటి బీజేపీ అనుసరించిన విధానాల వల్ల ఈ ప్రాంత ప్రజలల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.
ముఖ్యంగా ఈప్రాంతములో అధికంగా వున్నజాట్ జనాభాలో కూడా అసంతృప్తులు చోటు చేసుకొన్నాయి. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను దక్కించు కోవాలంటే హిందూ ఓటు బ్యాంకును తనవైపు నిలబెట్టుకోవాలసిన అవసరం బీజేపీకి ఉంది.. అందులో భాగమే విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ జలాభిషేకం ఊరేగింపు. ఒక పథకం ప్రకారం కవ్వింపు , రెచ్చగొట్టే నినాదాలు, చర్యలు చేపట్టి ముస్లీం మైనార్టీలపై దాడులకు దిగారు. అధికారికంగా ఈ విషయాలను ఒప్పు కోకపోయినా, చెప్పకపోయినా, బీజేపీ లోని కొందరు ముఖ్య నాయకులు ఈ విషయాలను అ ప్రత్యక్షంగా ,అనధికారికంగా ఆయా సందర్భాలలో ఒప్పుకొంటున్నవిషయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హర్యానా అల్లర్లను ఖండించిన బాలివుడ్
హర్యానా అల్లర్లు, హింసను బాలివుడ్ సినీ ప్రముఖులు ధర్మేంధ్ర, సోనుసూద్ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. అల్లర్ల మృతుల ఆత్మశాంతి కల్గాలని, క్షతగాత్రులు త్వరగా కొలుకోవాలని ఆక్షాక్షించారు. ప్రజలు సోదరుభావంతో వ్యవహారించి మానవత్వంతో మెలిగి శాంతికి సహకరించాలని కోరారు.