Bone broth benefits : పాయ అంటే హైదరాబాదీలకు ఎంతిష్టమో చెప్పక్కర్లేదు. పొద్దున్నే పాయా-బన్ కాంబినేషన్ ఇక్కడ చాలా ఫేమస్. చాలా కేఫ్‌ల్లో దొరుకుతుంది. ఎనిమిది గంటల కల్లా అయిపోతుంది కూడా. ఎంత రుచికరంగా ఉంటుందో అంత అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. తెలంగాణలో కాళ్ల షోర్వా (paya soup) అంటే పడి చస్తారు. ఇది కేవలం రుచికే అనుకుంటే పొరపాటు. పాయాలో అద్భుతమైన పోషకవిలువలు, రోగనిరోధకశక్తి ఉన్నాయి. కొవిడ్ టైమ్‌లో చాలామంది తెలియని వారు కూడా దీన్ని […]

Bone broth benefits : పాయ అంటే హైదరాబాదీలకు ఎంతిష్టమో చెప్పక్కర్లేదు. పొద్దున్నే పాయా-బన్ కాంబినేషన్ ఇక్కడ చాలా ఫేమస్. చాలా కేఫ్‌ల్లో దొరుకుతుంది. ఎనిమిది గంటల కల్లా అయిపోతుంది కూడా. ఎంత రుచికరంగా ఉంటుందో అంత అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది.
తెలంగాణలో కాళ్ల షోర్వా (paya soup) అంటే పడి చస్తారు. ఇది కేవలం రుచికే అనుకుంటే పొరపాటు. పాయాలో అద్భుతమైన పోషకవిలువలు, రోగనిరోధకశక్తి ఉన్నాయి. కొవిడ్ టైమ్‌లో చాలామంది తెలియని వారు కూడా దీన్ని రుచి చూసారు. ఇప్పటి పిల్లలు చాలామంది అసలు మటన్ తినడానికే ఇష్టపడటం లేదు. కానీ, పేరెంట్స్ వారికి నెలకోసారైనా పాయాను తినిపిస్తే ( తాగిస్తే ) చాలా చాలా మంచిది.
ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఈ వంటకం (bone broth) నిజానికి చాలా పాతది. అప్పట్లో జలుబు, గొంతు నొప్పి, కాళ్లుచేతులు విరిగిన వాళ్లకు పాయా తాగమని పెద్దలు సలహా ఇచ్చేవారు. ఇప్పుడు దీని మీద చాలామంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఆహారనిపుణులు పరిశోధనలు చేసి, దీన్ని మరో అమృతంగా అభివర్ణించారు. పాయాలో కొలాజెన్(collagen) అనే ప్రొటీన్ విరివిగా ఉంటుంది. ఇది చర్మసౌందర్యాన్ని పెంచి పోషిస్తుంది. వివిధ రకాలైన ఖనిజాలు నొప్పి నివారణకు, గాయాలు తొందరగా మానడానికి, ఎముకలకు బలాన్నివ్వడానికి పనికి వస్తాయి.
ముఖ్యంగా ఎముకలు విరిగినప్పుడు (Bone Fractures), తిరిగి అతుక్కునే ప్రక్రియను చాలా వేగవంతం చేస్తుంది. కాలేయం నుండి విషపదార్థాలను తొలగించి, శుభ్రం చేస్తుంది(Detoxification). పోషకాలను తొందరగా శోషింపజేసి శరీరానికి సకాలంలో అందజేయగల సామర్థ్యం దీని సొంతం. ఇవన్నీ ఈ మధ్య చేసిన పరిశోధనా ఫలితాలు. మన పూర్వీకులు కొన్ని తరాలకు ముందే దీని గొప్పతనం తెలుసుకున్నారు కాబట్టి, అప్పట్లో విరివిగా వాడేవారు. ఇప్పుడు కూడా నడివయసు వచ్చినవారికి ఇది ఇష్టమైన వంటకమే. (Telangana best receipe)
సాధారణంగా మేక లేదా గొర్రె (Lamb) ముంగాళ్ల ముక్కలతో తయారుచేసే పులుసే ఈ పాయా లేదా కాళ్ల షోర్వా. కొంతమంది కోళ్లు, బీఫ్ ఎముకలను కూడ వాడతారు. ఎక్కువగా మటన్ పాయనే బాగా ప్రాచుర్యం పొందింది. ఎముక ముక్కలను రకరకాల మసాలాదినుసులు, కాయగూరముక్కలతో కలిపి, చాలా నీళ్లతో, చాలా సేపు మరిగిస్తారు. ఆ చారు కొంచెం చిక్కగా, జారుడుగా అయ్యేవరకు ఉంచి దించేస్తారు. అది వేడివేడిగా తాగితేనే దాని రుచి తెలుస్తుంది.
రుచి సంగతి పక్కనబెడితే, ఈ షోర్వా అందించే మరికొన్ని లాభాలను ఇప్పడు చూద్దాం.(Bone broth benefits)
1. రోగ నిరోధక శక్తిని పెంపొదిస్తుంది.( Boosts immunity)
పాయా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పెంచి, తద్వారా రోగనిరోధక శక్తిని ఇనుమడింపచేస్తుంది. ప్రొలైన్, గ్లుటమైన్, ఆర్జిమైన్ వంటి అమినో ఆమ్లాల (Amino Acids) ద్వారా జీర్ణాశయ గోడలను దృఢంగా మార్చి, ఇమ్యూనిటీని బలపరుస్తుంది. శరీరానికి బలానివ్వడమే కాకుండా, మంచి నిద్రకు, మానసిక ఆనందానికి కూడా దోహదపడుతుంది.
2. జీర్ణ వ్యవస్థకు ఎంతో లాభం ( Helps metabolism)
పాయా పులుసు జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియాను పెంచి, వాపు, అల్సర్ల వంటి వాటిని తగ్గిస్తుంది. చాలా త్వరగా జీర్ణమయ్యే గుణమున్న ఈ పాయాలో ఉండే జిలటిన్ అనబడే ప్రొటీన్ ఫుడ్ అలర్జీలను కూడా అరికడుతుంది.
3. బరువును తగ్గిస్తుంది(Reduces Obesity)
శరీరంలో అధిక కేలరీలను పోగుచేసే ఫర్మిక్యూట్లు (Firmicutes)అనబడే బాక్టీరియా సంఖ్యను గణనీయంగా తగ్గించి, తద్వారా బరువు (Obesity) పెరగకుండా చూస్తుంది పాయా. దీనికి కారణం పాయాలో ఉండే ఎల్-గ్లుటమైన్ అనే అమినో ఆమ్లం.
4. కండరాలను పెంచుతుంది( Muscle booster)
కండర కణజాల అభివృద్ధికి పాయాలో ఉండే అమినో ఆమ్లాలు ఎంతగానే సహాయపడతాయి. అమినో ఆమ్లాలు కండరాలను పెంచే విషయంలో, వాపును తగ్గించడంలో ఆరోగ్యవంతుడి శరీరంలోనూ, క్యాన్సర్ పేషెంట్ శరీరంలోనూ బాగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
5. నిర్విషీకరణలో సూపర్ కాప్ ( Best Detoxification Agent)
ఎముకల షోర్వా శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో ప్రముఖ పాత్రం పోషిస్తుంది. కణజాలంలో, కాలేయంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపే పొటాషియం, గ్లైసిన్‌లు పాయాలో పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి దోహదపడుతుంది.
6. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది (Reduces joint pains)
పాయాలో ఉండే గ్లుకోసమైన్, కాండ్రయిటిన్ అనే సమ్మేళనాలు కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతూ అర్థరైటిస్, ఆస్తియోఅర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తాయి. సకశేరుకాల ( వెన్నెముక కలిగిన జంతువులు) ఎముకలు, మృదులాస్థి, మజ్జ (మూలుగ), లిగమెంట్లలో లభించే ప్రొటీన్ శరీరానికి అత్యంత లాభదాయకం. గెలటిన్ అనబడే పోషకం ఎముకలను దృఢపరచడంలో, ఎముక ఖనిజ సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే, పాయాతో ఎన్నో లాభాలు. ఇవన్నీ ఈ మధ్యే కనుగొన్నవే అయినా, ఏమీ తెలియని మధ్యవయస్కులు, పెద్దవారిలో చాలామందికి పొద్దున్నే పాయా తాగిరావడం అలవాటు. అదే వారిని ఇంకా కాపాడుతుందనే విషయం వారికి తెలియదు. పాయా మంచిదని మాత్రమే వారికి తెలుసు. ఆ రుచీ తెలుసు. పెరిగే పిల్లలు, పెద్దవారు, ఇలా వయసు తారతమ్యం లేకుండా ఈ కాళ్ల షోర్వాను తీసుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ( Health is wealth)
Also Read :
Health Tips | పాలతో కలిపి పిస్తాలను తీసుకుంటే.. ఎన్ని లాభాలతో తెలుసా..?
Health Tips | అరటి తొక్కే కదా.. అని తీసి పారేయొద్దు..!
