Medak
విధాత, మెదక్ బ్యూరో: సిద్ధిపేట గ్రామీణ మండలం రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ వాఖ్యలపై నిర్వహించిన రైతు సమావేశంలో రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు వారసుడు అని, 24 గంటలు 3 పంటలకు నీళ్ళు ఇచ్చే పార్టీ కావాలా.. 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా అని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్, కాలిపోయే మోటార్లు చూశామన్నారు. తెలివి లేని కాంగ్రెస్ నాయకులు 3 గంటల కరెంట్ సరిపోతదంటున్నారని ఎద్దేవా చేశారు. 3 గంటల కరెంట్ అందించే పార్టీ కావాలా.? లేదా 24 గంటలు కరెంట్ ఇచ్చే పార్టీ కావాలో తేల్చుకోవాలని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటి వరకు రైతు బంధు కింద 11 విడతల్లో 72 వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దే నని అన్నారు. 24 గంటల కరెంట్ కోసం ప్రతి యేటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఎండ కాలంలో కూడా పెద్ద చెరువు నిండుకుండలా ఉందని గుర్తు చేశారు.
రాఘవాపూర్ గ్రామంలో 40 మంది రైతులకు రైతు భీమా అందించామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1 లక్ష 6 వేల 74 మంది రైతులకు రైతు భీమా అందించామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు వారసుడు రేవంత్ రెడ్డి అని అన్నారు.
ఒకనాడు బతుకుదెరువు కోసం తెలంగాణ వాళ్ళు పక్క రాష్ట్రాలకు పోతే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వరినాట్లు వేయడానికి కార్మికులు వలస వచ్చే స్థితికి తెలంగాణ చేరిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ప్రతీ ఒక్క రైతు ఆలోచించాలని సూచించారు.