Nalgonda | జలయజ్ఞం ప్రాజెక్టులపై.. TRS నిర్లక్ష్యం: భట్టి విక్రమార్క
Nalgonda నల్గొండలో సాగుక చుక్కనీరు అదనంగా ఇవ్వలేదు.. చర్చకు సిద్ధమని బి ఆర్ ఎస్ నాయకులకు భట్టి సవాల్ విధాత: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జల యజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేయకుండా నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలం, డిండి నక్కల గండి ప్రాజెక్ట్ పాదయాత్ర శిబిరం వద్ధ ఆయన మీడియాతో మాట్లాడారు. […]

Nalgonda
- నల్గొండలో సాగుక చుక్కనీరు అదనంగా ఇవ్వలేదు..
- చర్చకు సిద్ధమని బి ఆర్ ఎస్ నాయకులకు భట్టి సవాల్
విధాత: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జల యజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేయకుండా నల్లగొండ జిల్లాకు తీవ్ర నష్టం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలం, డిండి నక్కల గండి ప్రాజెక్ట్ పాదయాత్ర శిబిరం వద్ధ ఆయన మీడియాతో మాట్లాడారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 16 పంటలకు వరుసగా నీళ్లు ఇచ్చి రైతులకు న్యాయం చేసామని మంత్రి జి. జగదీష్ రెడ్డి చెప్పడం విడ్డూరమన్నారు. లస్కర్ ఉద్యోగం చేస్తూ న్యాయం చేశామంటే ఎట్లా? మీ కంటే ముందున్న ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2014 సంవత్సరానికి ముందే రాష్ట్రంలో 95 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందన్నారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం ఏర్పాటు నాటికి తెలంగాణలో 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. 2004 సంవత్సరం నాటికి అప్పటివరకు పాలన చేసిన ప్రభుత్వాలు మరో 35 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చాయన్నారు.
2004 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 95 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు ఉన్నాయన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 5 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై భారం మోపిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది ఏండ్లు అవుతున్న రాష్ట్రంలో ఒక్క మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, చిన్న చెరువునైనా కొత్తగా తవ్వారా అని ప్రశ్నించారు.
కృష్ణ గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టి ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు ఇచ్చారా అని, 30 నెలల్లో పూర్తి చేస్తామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. పెండింగ్లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నీళ్లిచ్చాం అందుకే పంటలు విపరీతంగా పండుతున్నాయని చెప్పడం విడ్డూరమన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ నుంచి ఒక ఎకరానికి కూడా అదనంగా చుక్కనీరు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీ కెనాల్స్ మిడ్ మేనేర్ కు, ఎస్సారెస్పీకి ఏమైనా కలిపారా? అని నిలదీశారు.
శ్రీపాద ఎల్లంపల్లి కి ఎస్ఆర్ఎస్పి, కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తుండగా, మిడ్ మానేరుకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు వస్తున్నాయని, కాలేశ్వరం నుంచి కాదన్నారు. కాకతీయ కెనాల్ కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాలేశ్వరంతో కరెంటు బిల్లు నష్టం తప్ప తెలంగాణ ప్రజలకు రైతులకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు.
యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్స్ పూర్తి చేయకుండా రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేశామని బిఆర్ఎస్ సర్కార్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే తెలంగాణకు 54% అదనంగా కరెంట్ ఇవ్వాలని ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దగ్గరుండి చట్టం చేయడం వల్ల తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా ఉన్నాయన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఈ ఎన్ సి వెళ్లకుండా సీఎంఓ సెక్రెటరీ స్మితా సబర్వాల్ వెళితే ప్రయోజనం ఏముంటుందన్నారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమీ లేదన్నారు.
బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నల్లగొండ జిల్లాకి కొత్తగా చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదని, దీనిపై నేను చర్చకు సిద్ధమని బి ఆర్ ఎస్ నాయకులకు భట్టి సవాల్ చేశారు.