Telangana
విధాత, హైదరాబాద్: తెలంగాణలో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒక కౌలు రైతు ఉన్నారన్నారని జాతీయ రైతు ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్యర్యంలో మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కౌలు రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ కౌలు రైతుల సమస్య కేవలం తెలుగు రాష్ట్రాల సమస్య కాదు దేశ వ్యాప్తంగా కౌలు రైతుల ఇబ్బందులు పడుతున్నారన్నారు.
తెలంగాణలో అసలు కౌలు రైతులు లేరని సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. సొంత భూమి సాగు చేస్తున్న వారి కంటే కౌలు రైతులకు కష్టాలు ఎక్కువన్నారు. సొంత భూమి ఉన్న వారికి, విత్తనాల సబ్సిడీ, రైతు బంధు, బ్యాంకులో రుణాలు ఇతర సదుపాయాకుంటాయి కానీ కౌలు రైతులకు ఎలాంటి సదుపాయాలూ ఉండవన్నారు. 50 శాతం రైతులకు గిట్టుబాటు ధర దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల కోసం గుర్తింపు కార్డు తీసుకొస్తామని చెప్పి, ఒక జిల్లాకి మాత్రమే పరిమితం చేశారని తెలిపారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గర ఉండడంతో కౌలు రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా మారాలని, దానితో అయినా ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలు గుర్తిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతీయ రైతు హక్కుల కార్యకర్త కవిత కురుగంటి, మాజీ జే డీ లక్ష్మీనారాయణ, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రైతు ఉద్యమ నాయకులు, 150 మంది రైతులు, జాతీయ రైతు ఉద్యమ నాయకులు, హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు.
గతంలో ఎరువుల ధరలు తక్కువగా ఉండేవి, ఇప్పుడు వాటి ధరలు రెట్టింపు అవ్వడంతో సాగు చాల కష్టతరంగా మారింది. ఎరువులపై కౌలు రైతులకు సబ్సిడీ లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. పట్టాదారుకు ఏ విధంగా ఇవన్నీ అందిస్తున్నారో అలాగే మాకు కూడా ప్రభుత్వం అందించాలి.
కౌలు రైతు హరీశ్, జమ్మికుంట, కరీంనగర్
రైతుల కోసం కేంద్రం 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు. పోగా రైతుల వ్యవసాయ పనిముట్లకోసం ఎలాంటి సబ్సిడీ అందించడంలేదు. కనీసం గిట్టు బాటు ధర కూడా అందడంలేదు. ఐకేపీ కేంద్రాల్లో అమ్మకానికి వెళితే క్వింటాకు పది కిలోలు కోత విధిస్తున్నారు. దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు. పట్టాదారుకు ఇచ్చే కౌలు, పెట్టుబడికి అయ్యే ఖర్చు పూర్తిగా తీసేస్తే కౌలు రైతుకు మిగిలేది ఏం లేదు. అదీకాక వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోవడంలేదు. దీంతో అప్పుల పాలు అవ్వాల్సి వస్తోంది. ఆ అప్పులు తీర్పలేక కౌలు రైతులు బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు.