Opposition | పట్నాలో ప్రతిపక్ష కాంక్లేవ్‌.. కూటమిగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలు!

Opposition | విధాత: అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష సదస్సులకు రంగం సిద్ధమైంది. ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సదస్సులు జరిగిన విషయం విదితమే. 1989,90లలో జనతాదళ్‌, ఎన్‌టీఆర్‌ నాయకత్వంలో ప్రతిపక్ష నాయకుల సదస్సులు జరిగాయి. ఈ సదస్సుల పర్యవసానంగానే అప్పట్లో జాతీయ ఫ్రంట్‌ ఏర్పడింది. ఇప్పుడు ఇటువంటి ప్రయత్నమే జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ చేస్తున్నారు. పట్నా సదస్సు ప్రతిపక్ష కూటమి ఆవిర్భావానికి దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పట్నాలో […]

  • Publish Date - May 29, 2023 / 11:57 AM IST

Opposition |

విధాత: అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష సదస్సులకు రంగం సిద్ధమైంది. ఒకప్పుడు దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సదస్సులు జరిగిన విషయం విదితమే. 1989,90లలో జనతాదళ్‌, ఎన్‌టీఆర్‌ నాయకత్వంలో ప్రతిపక్ష నాయకుల సదస్సులు జరిగాయి.

ఈ సదస్సుల పర్యవసానంగానే అప్పట్లో జాతీయ ఫ్రంట్‌ ఏర్పడింది. ఇప్పుడు ఇటువంటి ప్రయత్నమే జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ చేస్తున్నారు. పట్నా సదస్సు ప్రతిపక్ష కూటమి ఆవిర్భావానికి దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

పట్నాలో జూన్‌ 12న ప్రతిపక్ష పార్టీల సదస్సు నిర్వహించనున్నట్టు జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను ఈ సదస్సుకు ఆహ్వానించనున్నట్టు నీరజ్‌ కుమార్‌ చెప్పారు. దేశంలోని పత్రిపక్షాలన్నింటినీ ఒక్క తాటి పైకి తీసుకు రావడానికి జేడీయూ అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌ సంప్రదింపులు జరుపుతున్న విషయం విదితమే.

నితీష్‌ ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలను కలసి ప్రాథమికంగా మాట్లాడారు. ఈ సంప్రదింపులకు కొనసాగింపుగానే పట్నా సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు నితీష్‌కుమార్‌ అధ్యక్షత వహిస్తారని నీరజ్‌ కుమార్‌ చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక కూటమిగా ఆవిర్భవించే అవకాశాలున్నాయి.

ఎన్నికలకు ముందే ఒక కూటమి ఏర్పడడం రాజకీయ అవసరంగా నితీష్‌ కుమార్‌ భావిస్తున్నారు. బిహారులో ప్రతిపక్షాలు ఏకంకావడంవల్లనే బీజేపీని నిలువరించగలిగాయని ఆయన భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడకపోతే పార్లమెంటులో ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించిన పార్టీని ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించవలసి వస్తుందని, అది బీజేపికి అనుకూలించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికలకు ముందు ఏర్పడే కూటమి ఏకైక పెద్ద కూటమిగా అవతరించినా లేక అధికారానికి తగిన సీట్లు సాధించినా ముందుగా ఆ కూటమినే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించవలసి ఉంటుందని వారు భావిస్తున్నారు. బీజేపీకి లేక ఎన్‌డీఏకు ఈ సారి రెండువందల లోపే స్థానాలు వస్తాయని ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి ఏర్పడవలసిన అవసరాన్ని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంతో ఈ కూటమి ఏర్పడితే దేశంలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.