Telangana | రాజకీయ అస్త్రంగా ‘పాలమూరు -రంగారెడ్డి ‘
Telangana అసంపూర్తిగా ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ఇంకా 60 శాతం పెండింగ్ అయినా.. ప్రారంభానికి కేసీఆర్ పట్టు ఓట్ల కోసమే అంటున్న కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకనే నిందలు… బీఆర్ఎస్ విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ప్రస్తుతం రాష్ట్రంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుపై వాడివేడి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నారని అధికారిక ప్రకటన విడుదల కావడమే వివాదాన్ని తెరపైకి తెచ్చింది. పనులు పూర్తి కాని ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తున్నారని విపక్ష పార్టీలు […]

Telangana
- అసంపూర్తిగా ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు
- ఇంకా 60 శాతం పెండింగ్
- అయినా.. ప్రారంభానికి కేసీఆర్ పట్టు
- ఓట్ల కోసమే అంటున్న కాంగ్రెస్, బీజేపీ
- ఓర్వలేకనే నిందలు… బీఆర్ఎస్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ప్రస్తుతం రాష్ట్రంలో పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుపై వాడివేడి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నారని అధికారిక ప్రకటన విడుదల కావడమే వివాదాన్ని తెరపైకి తెచ్చింది. పనులు పూర్తి కాని ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తున్నారని విపక్ష పార్టీలు బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ ఏకంగా కేసీఆర్ పైకే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. పనులు అసంపూర్తి దశలో ప్రాజెక్టును ప్రారంభించి ఓట్లు దండుకోవడం కోసమే కేసీఆర్ కొత్త డ్రామాకు తెర లేపారని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు పనులు 40 శాతం కూడా పూర్తి కాలేదని, అలాంటి ప్రాజెక్టును ప్రారంభించి నీటిని ఎక్కడకు తరలిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రారంభించే నార్లాపూర్ వద్ద తొమ్మిది పంపులకు ఒకే పంపు పనులు పూర్తికావడం, అదే మోటార్ పంప్ ను ఆయన ప్రారంభించడం హాస్యాస్పదంగా ఉందని అన్ని పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు అధికార, విపక్ష పార్టీలకు రాజకీయ వేదికగా మారింది. ప్రస్తుతం పాలమూరు జిల్లా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టు పనులపై ఎవరేమన్నారంటే.
ప్రాజెక్టు నిధులు దోచుకున్న కేసీఆర్ ముఠా : డీకే అరుణ
ప్రాజెక్టు పనులు పలు దశల్లో పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసే సోయి లేని సీఎం కేసీఆర్.. ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తానని అనడం చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఇంకా 60 శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రధాన కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నా, ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించడం చూస్తే, ఓట్ల కోసం కొత్త నాటకం ఆడుతున్నారని అర్థమవుతోంది. ఆయన ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు.
ఏం మొహం పెట్టుకుని ప్రారంభిస్తారు : నాగం జనార్ధన్ రెడ్డి
ప్రాజెక్టు ఎక్కడి పనులు అక్కడ పెండింగ్ లో పెట్టి, ప్రారంభానికి సీఎం కేసీఆర్ ఏం మొహం పెట్టుకుని వస్తున్నారు. 40 శాతం పూర్తి అయిన ప్రాజెక్టును ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో రూ.వందల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ దండుపాళెం ముఠాకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. పూర్తి కానీ ప్రాజెక్టు ను ప్రారంభిస్తే అడ్డుకుంటాం.
ప్రశ్నిస్తే అడ్డుకున్నారు : జూపల్లి కృష్ణారావు
ప్రాజెక్టు సందర్శనకు వెళుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నది. పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఎత్తి చూపుతాననే ఉద్దేశంతో పోలీస్ లు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ డొల్ల తనం బయట పడుతుందనే భయం వారిది. నార్లపూర్ వద్ద తొమ్మిది మోటారు పంపులకు ఒక్కటే సిద్ధంగా ఉంది. మిగతా పంపులు పూర్తి కాకుండానే ప్రాజెక్టు పనులు పూర్తి అయినట్లు ప్రకటించేశారు. ప్రాజెక్టు పనులు ఎక్కడ పూర్తి అయ్యాయో చూపించాలి. పనులు పూర్తి ఆయినట్లు చూపిస్తే ప్రగతి భవన్ ఎదుట ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటా.
కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ : గౌని మధుసూదన్ రెడ్డి
పూర్తి కానీ ప్రాజెక్టు ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు నెమ్మదిగా జరగడంతో ఎప్పుడో పూర్తి అయ్యే ప్రాజెక్టు ఐదేళ్ళయిన ఇంకా పలు పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. నార్లాపూర్ పంప్ హౌస్ లో తొమ్మిది మోటార్ల కు ఒక్కటి మాత్రమే పూర్తి అయ్యింది. ఆ ఒక్కమోటర్ ప్రారంభిస్తే అక్కడి నుంచి నీరు ఏదుల, వట్టెం, కరివెన జలాశయాల్లోకి రావాలి. కానీ ఆ జలాశయాల్లోకి రావాలంటే ప్రధాన కాలువల పనులే పూర్తి కాలేదు. ఓట్ల కోసమే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు స్పష్టమౌతోంది.
ఓట్ల కోసం తెర పైకి : హర్షవర్ధన్ రెడ్డి
సీఎం కేసీఆర్ ఓట్లు దండుకోవడం కోసం ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారు. ప్రస్తుతం పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును ప్రజల ముందుకు తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి విమర్శిస్తున్నారు. జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు వ్యతిరేకం అనే విషయం తెలుసుకున్న కేసీఆర్ ఇక్కడి ప్రజలను ఆక్కట్టుకునేందుకు ఈ ప్రాజెక్టు ప్రారంభం అనే ఎత్తుగడ వేస్తున్నారు.
ప్రాజెక్టుతో పాలమూరు సస్యశామలం – మంత్రి నిరంజన్ రెడ్డి
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు తో ఉమ్మడి పాలమూరు జిల్లా లోని పలు ప్రాంతాలు సస్యశామలంగా మారుతాయి. సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ను ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు తాగునీరు అందుతుంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు.
బీడు భూముల్లో పచ్చదనం – మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఈ ప్రాజెక్టుతో బీడు పొలాలు పచ్చదనంతో కళకళలాడుతాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓర్వలేక నానా ఆరోపణలు చేస్తున్నారు. ఓట్ల కోసమే ప్రారంభిస్తున్నామనే విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీ లకు ప్రజలే బుద్ది చెప్తారు. పాలమూరు ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కెసిఆర్ కే దక్కింది. మళ్ళీ తామే అధికారంలోకి వస్తాం.