Sharad Pawar, PM Modi | ఒకే వేదికపై శరద్, మోదీ!
Sharad Pawar, PM Modi ఆగస్ట్ 1న ముంబైలో ప్రధానికి అవార్డు ముఖ్య అతిథిగా వెళ్లనున్న శరద్ పవార్ ప్రతిపక్షాల కూటమి నేతల్లో ఆందోళన ‘ఇండియా’ పక్షానే ఉన్నానంటున్న పవార్ న్యూఢిల్లీ : త్వరలో మహారాష్ట్రలో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పాల్గొననుండటం ప్రతిపక్షాల కూటమిలో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం చీలిక నేపథ్యంలో పార్టీని ఐక్యంగా ఉంచేందుకు పవార్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మేనల్లుడు అజిత్‌పవార్‌తో పాటు.. అత్యంత […]

Sharad Pawar, PM Modi
- ఆగస్ట్ 1న ముంబైలో ప్రధానికి అవార్డు
- ముఖ్య అతిథిగా వెళ్లనున్న శరద్ పవార్
- ప్రతిపక్షాల కూటమి నేతల్లో ఆందోళన
- ‘ఇండియా’ పక్షానే ఉన్నానంటున్న పవార్
న్యూఢిల్లీ : త్వరలో మహారాష్ట్రలో ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పాల్గొననుండటం ప్రతిపక్షాల కూటమిలో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం చీలిక నేపథ్యంలో పార్టీని ఐక్యంగా ఉంచేందుకు పవార్ చాలా ఇబ్బంది పడుతున్నారు.
మేనల్లుడు అజిత్‌పవార్‌తో పాటు.. అత్యంత నమ్మకస్తులనుకున్న దిలీప్ వాల్సే పాటిల్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ వంటి నాయకులు చీలిక పక్షం వైపు నిలిచి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. తన ప్రకటనల ద్వారా గానీ, సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు గానీ, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యవహరిస్తున్న తీరుగానీ కొత్తగా ఏర్పడిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్, ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డీఐఏ) పట్ల శరద్‌పవార్ అచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. గత నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు చీలికవర్గం నేతలతో అంతర్గతంగా సమావేశాలు జరుపడం చర్చలకు తావిచ్చింది.
అయితే.. పార్టీని ఐక్యంగా ఉంచే క్రమంలోనే ఈ సమావేశాలని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా శరద్‌పవార్ తన రాజకీయ వైఖరిని విస్పష్టంగా ప్రకటించడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీని ఐక్యంగా ఉంచే క్రమంలో ఆయన బీజేపీ పక్షాన చేరే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ పాల్గొనే కార్యక్రమంలో ఆయనతో కలిసి శరద్‌పవార్ కూడా వేదిక పంచుకోనుండటంతో వదంతులు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలో తీవ్ర గందరగోళానికి కూడా తావిస్తున్నాయి.
మోదీ నాయకత్వానికి అవార్డు
లోక్‌మాన్య తిలక్ స్మారక మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 1న ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ‘పౌరుల్లో దేశభక్తిని పెంచేందుకు మోదీ చేసిన కృషిని, ఆయన నాయకత్వాన్ని’ గుర్తిస్తూ ఆయనకు అవార్డు ఇవ్వనున్నారు. శరద్‌పవార్‌ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రమేశ్ బాయిస్‌తోపాటు.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు అజిత్‌పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ముఖ్యులు హాజరుకానున్నారు.
విమర్శల జోరు తగ్గించిన ఉభయ వర్గాలు
ఎన్సీపీ రెండు వర్గాలు తిరుగుబాటు తొలి రోజుల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నప్పటికీ.. ఇటీవల అజిత్‌పవార్, ప్రఫుల్ పటేల్ పార్టీ అధినేతను ఆయన నివాసంలో కలిసిన తర్వాత రెండు పక్షాలూ సంయమనం పాటిస్తుండటం గమనార్హం.
శుక్రవారం జరిగిన సమావేశంలో పలు ప్రతిపక్షాల నేతలు మోదీకి అవార్డు కార్యక్రమంలో శరద్‌పవార్ పాల్గొననున్న అంశాన్ని ప్రస్తావించినట్టు వార్తలు వచ్చాయి. మణిపూర్ హింసపై మోదీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో పోరాడటమే కాకుండా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన ఇటువంటి తరుణంలో మోదీ కార్యక్రమానికి శరద్‌పవార్ హాజరుకావడం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ అంశాన్ని ఒక ప్రాంతీయ పార్టీ ముందుగా ప్రస్తావించగా.. ఈ అంశంపై పవార్‌తో మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇతర పార్టీలు కోరినట్టు ఆ వార్తలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో ఎన్సీపీ (పవార్ వర్గం) తరఫున రాజ్యసభ ఎంపీ వందనాచవాన్ ఒక్కరే ఉన్నారు. ఈ అంశంపై వ్యాఖ్యానిం చేందుకు నిరాకరించారు. ‘నిద్రపోయే వాళ్లను మేల్కొల్ప వచ్చుగానీ.. నిద్ర నటించే వాళ్లను లేపలేమని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఆగస్ట్ 1న ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
ఆగస్ట్ 1న మోదీ కార్యక్రమం రోజునే పార్లమెంటులో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును కేంద్రం తీసుకురానున్నది. అదే రోజు రాజ్యసభలో దాన్ని ఓటింగ్‌కు ఉంచనున్న నేపథ్యంలో పలువురు ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో అందుబాటులో ఉండేందుకు గాను.. మోదీ అవార్డు కార్యక్రమానికి వెళ్లవద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం శరద్‌పవార్‌ను కోరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ పరిణామాలు, ప్రతిపక్ష పార్టీల్లో ఆందోళనలు, అభ్యంతరాలు ఎలా ఉన్నా.. తాను మాత్రం ఇండియా కూటమి పక్షాన గట్టిగా నిలబడే ఉన్నానని కాంగ్రెస్ నాయకులతో పవార్ అన్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా.. ముంబైలో జరిగే ప్రతిపక్షాల మూడో భేటీని దిగ్విజయం సాధించేందుకు కృషి చేస్తానని కూడా చెప్పారని సమాచారం.
ఇదే విషయంలో శుక్రవారం రాత్రి పలువురు కాంగ్రెస్ నేతలను పిలిపించుకుని చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా ఆయన చర్చించారని సమాచారం. ప్రతిపక్షాల సమావేశం రోజున ముంబైలో మహా వికాస్ అఘాడీ తరఫున భారీ ర్యాలీ నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తున్నది.