
- మెజార్టీకి అక్కడి సీట్లే కీలకం
- గెలుపుపై ప్రధాన పార్టీల ఫోకస్
- రాష్ట్రంలో 39 రిజర్వుడ్ స్థానాలు
- ఎస్సీ స్థానాలు 19, ఎస్టీలవి 12
విధాత ప్రత్యేకం : అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్న అధికార బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ మార్క్ 60 సీట్ల సాధనకు రిజర్వుడు స్థానాలే కీలకంగా గుర్తిస్తున్నాయి. అక్కడ సాధించే గెలుపు.. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుందన్న అభిప్రాయంతో ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలకుగాను.. 31 స్థానాలు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు. అందులో చెన్నూరు, బెల్లంపల్లి, జుక్కల్, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, జహీరాబాద్, అందోల్, చేవెళ్ల, వికారాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, అచ్చంపేల, నకిరేకల్, తుంగతుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి.. ఎస్సీలకు రిజర్వ్ చేయగా.. మరో పన్నెండు నియోజకవర్గాలు.. ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, దేవరకొండ, డోర్నకల్, మహబూబాబాద్, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, ములుగు నియోజకవర్గాలు ఎస్టీలకు కేటాయించినవి. వాటిలో గెలిచేందుకు అటు బీఆరెస్, ఇటు కాంగ్రెస్ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు రిజర్వుడు నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం సాగిస్తూనే, వారిని ఆకట్టుకునేలా హామీలిస్తూ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్, ప్రియాంకగాంధీతోపాటు.. మల్లికార్జున ఖర్గే సహా ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ఆయా వర్గాలకు ఇస్తున్న హామీలను వారికి ఏకరువు పెడుతున్నారు. బీజేపీ సైతం అదే పద్ధతిలో ప్రచారం సాగిస్తున్నది.
21 జిల్లాలపై ప్రభావం
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 21 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 19 ఎస్సీ నియోజకవర్గాలకుగాను బీఆరెస్ పార్టీ 16 చోట్ల విజయం సాధించింది. 2 కాంగ్రెస్, ఒక చోట టీడీపీ గెలిచాయి. సత్తుపల్లిలో టీడీపీ, నకిరేకల్‌లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా.. వారు బీఆరెస్‌లో చేరిపోయారు. మధిరలో కూడా కాంగ్రెస్ నెగ్గింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెల్లంపల్లి, చెన్నూరు, ధర్మపురి, మానకొండూరు, చొప్పదండి, అందోల్, జహీరాబాద్, అచ్చంపేట, అలంపూర్, తుంగతుర్తి, జుక్కల్, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్‌పూర్, చేవెళ్ల, వికారాబాద్ స్థానాల్లో బీఆరెస్ గెలుపొందింది. వాటిలో ఈ దఫా మళ్లీ మెజార్టీ స్థానాలు దక్కితే మూడోసారి అధికారం తథ్యమన్న ధీమాతో బీఆరెస్ ఉంది. ఆ నియోజకవర్గాల సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, ఆది నుంచి ఎస్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకు ఆసరాతో ఈ దఫా మెజార్టీ నియోజకవర్గాలు గెలిచి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పోరాడుతున్నది. బీజేపీ తన వంతు ప్రయత్నాలను చేస్తున్నది.
ఎస్టీ నియోజకవర్గాలదీ అదే పరిస్థితి
12 ఎస్సీ నియోజకవర్గాల్లో 5 స్థానాల్లో గతంలో బీఆరెస్ గెలిచింది. 5 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కో సీట్లో విజయం సాధించారు. ఖానాపూర్, దేవరకొండ, డోర్నకల్, బోధ్, మహబూబబాద్‌లలో బీఆరెస్ గెలిచింది. ములుగు, ఇల్లెందు, పినపాక, అసిఫాబాద్, భద్రాచలం కాంగ్రెస్ గెలిచింది. అశ్వారావు పేటలో టీడీపీ, వైరాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే అశ్వారావుపేట, వైరా, పినపాక, అసిఫాబాద్, ఇల్లెందు ఎమ్మెల్యేలు బీఆరెస్‌లో చేరిపోయారు. దీంతో 10ఎస్టీ స్థానాల్లో బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ములుగు, భద్రాచలంలో మాత్రమే కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు.
రిజర్వుడు సీట్లున్న జిల్లాల్లో కాంగ్రెస్ గాలి!
రిజర్వ్‌డ్ స్థానాలు ఎక్కువగా ఖమ్మం (7), వరంగల్ (5), ఆదిలాబాద్ (5) ఉమ్మడి జిల్లాల్లో ఉన్నాయి. కరీంనగర్‌లో 3, నల్లగొండలో 3, రంగారెడ్డిలో 2, మహబూబ్‌నగర్‌లో 2, మెదక్‌లో 2, హైదరాబాద్, నిజామాబాద్‌లలో ఒక్కో స్థానం ఉన్నాయి. రిజర్వుడు సీట్లు అధికంగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ గాలి వీస్తుండటం, సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యేలపై, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా నిరుద్యోగ ఓటర్లు తోడవుతున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకే పార్టీ రెండోసారి గెలవని చోట్ల..
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకునే క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బహుముఖ వ్యూహాలను రచిస్తున్నదని సమాచారం. రిజర్వుడు నియోజకవర్గాలతోపాటు ఇంతవరకు రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు ఏ పార్టీనీ గెలిపించని నియోజకవర్గాలపై కూడా కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించిందని చెబుతున్నారు. అలాంటి 27 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఈ దఫా విజయ సాధనకు క్యాడర్‌ను సిద్ధం చేసిందని తెలుస్తున్నది.
వరుసగా రెండుసార్లు ఒకే పార్టీని గెలిపించని నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, మక్తల్, వరంగల్ జిల్లాలో ములుగు, డోర్నకల్, నర్సంపేట, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, కరీంనగర్ జిల్లా రామగుండం, జగిత్యాల, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, తాండూరు, పరిగి, ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట, వైరా, ఖమ్మం, కొత్తగూడెంనియోజకవర్గాలున్నాయి. హైదరాబాద్ పరిధిలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ముషీరాబాద్, ఉప్పల్, శేరిలింగంపల్లిలలో కూడా వరుసగా రెండు సార్లు ఏ పార్టీ గెలవలేదు. ఈ దఫా వాటిలో మెజార్టీ సీట్లను గెలిస్తే అధికార పీఠం హస్తగతం కావడం తథ్యమని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారని సమాచారం.
