Telangana
విధాత: వీఆర్ఏలను ఇతర శాఖలకు సర్దుబాటు చేసిన నేపథ్యంలో జాబ్ చార్ట్ ప్రకారం రెవెన్యూ శాఖలో కేడర్ స్ట్రెంత్ నిర్దారించి ప్రతి మండలానికి క్షేత్ర స్థాయి పనులకు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు అదనపు సిబ్బందిని కేటాయించాలని ట్రెసా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరింది. ఈ మేరకు సోమవారం ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగరవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్‌ల నేతృత్వంలో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సర్వీస్ క్రమబద్ధీకరించి ఇతర శాఖలలో సర్దు బాటు చేసినేందుకు, డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులు కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పంధించి రెవెన్యూశాఖలో ఉద్యోగుల సమర్థత, జనాభా, పనిభారం ఆధారంగా సిబ్బందిని కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే సిబ్బంది కేటాయింపుకు అవసరమైన ప్రత్తిపాదనలు తయారు చేసి వెంటనే సమర్పించాలని రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ని ఆదేశించారని తెలిపారు.
ట్రెసా విజ్ఞప్తి మేరకు డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల ఫైల్ పై గత శనివారం ఆమోదించిన 61 పోస్టులకు అదనంగా 20 పోస్టులు పెంచుతూ మొత్తం 81 పోస్టులకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. గత వారం ఇచ్చిన 19 పోస్టులను కలుపుకొని 100 ప్రమోషన్లు సాధించడంపై రెవెన్యూ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రెసా ఉపాధ్యక్షులు కె. నిరంజన్ రావు, పి.రమేష్, కార్యదర్శి పి. మధు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, సభ్యులు వెంకటేష్, సుమ, శ్రీలత, సైదులు తదితరులు పాల్గొన్నారు.