Udaipur Declaration | కాంగ్రెస్‌ను.. వెన్నాడుతున్న ఉదయ్‌పూర్ డిక్లరేషన్
Udaipur Declaration బీసీలకు 50% సీట్లు.. ఐదేళ్ల అర్హతతో పదవులు ఆనాడు తీర్మానించిన కాంగ్రెస్ పెద్దలు దానికి విరుద్ధంగా నడుస్తుండంటంపై రచ్చ విధాత: తెలంగాణలో అధికార సాధన దిశగా ప్రజాక్షేత్రంలో అధికార బీఆర్ ఎస్, విపక్ష బీజేపీలతో గట్టి పోరాటం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ అంతే స్థాయిలో అంతర్గత పోరుతోనూ సతమతమవుతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉండే అపరిమిత అంతర్గత ప్రజాస్వామ్యంతో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణంగా భావించినప్పటికీ ఎన్నికల తరుణంలో పార్టీ పదవులు, టికెట్ల వ్యవహారాలు మాత్రం మరిన్ని […]

Udaipur Declaration
- బీసీలకు 50% సీట్లు.. ఐదేళ్ల అర్హతతో పదవులు
- ఆనాడు తీర్మానించిన కాంగ్రెస్ పెద్దలు
- దానికి విరుద్ధంగా నడుస్తుండంటంపై రచ్చ
విధాత: తెలంగాణలో అధికార సాధన దిశగా ప్రజాక్షేత్రంలో అధికార బీఆర్ ఎస్, విపక్ష బీజేపీలతో గట్టి పోరాటం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ అంతే స్థాయిలో అంతర్గత పోరుతోనూ సతమతమవుతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉండే అపరిమిత అంతర్గత ప్రజాస్వామ్యంతో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణంగా భావించినప్పటికీ ఎన్నికల తరుణంలో పార్టీ పదవులు, టికెట్ల వ్యవహారాలు మాత్రం మరిన్ని అంతర్గత కలహాలను రేపుతున్నాయి.
ముఖ్యంగా ఓబీసీలకు 50% టికెట్లు ఇవ్వాలని, పార్టీలో కనీసం ఐదేళ్లు పనిచేసిన వారికే పార్టీ కమిటీలో చోటు కల్పించాలని ఉదయపూర్ డిక్లరేషన్ చెబుతున్నది. అయితే ఇటీవల పీసీసీ పొలిటికట్‌ల్ అఫైర్స్ కమిటీ భేటీలో ఒక్కో పార్లమెంటు స్థానంలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాలైనా బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన వారికి 34 సీట్లు దక్కవచ్చు. అయితే జనాభా దామాషా మేరకు 56 శాతమున్న బీసీలకు ప్రతి లోక్‌సభ స్థానంలో కనీసం మూడు సీట్లు కేటాయిస్తే 51 స్థానాలైన దక్కుతాయని బీసీ నేతలు వాదిస్తున్నారు.
అయితే నియోజకవర్గాల వారీగా టికెట్ రేసులో ఉన్న అభ్యర్థుల బలాబలాలు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని గెలుపు గుర్రాలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఆ సమయంలో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనగలిగే బీసీ అభ్యర్థులు లేకపోయినా.. వారికే టికెట్లు ఇస్తే ఓడిపోవల్సి వస్తుందనేది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆందోళనగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీసీల టికెట్ల డిమాండ్ పంచాయతీ తీర్చేదెట్లా అన్న టెన్షన్ నాయకత్వాన్ని కలవర పెడుతున్నది.
ఇప్పటికే భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ బీసీకి ఇవ్వనున్నారన్న వార్తలతో అక్కడ నుండి టికెట్ రేసులో ఉన్న యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కారెక్కేశారు. ఇదే పరిస్థితి ఇతర నియోజకవర్గాల్లోనూ కొనసాగి, పార్టీ బలం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీంతో ఇతర పార్టీల్లోని బలమైన బీసీ అభ్యర్థులను పార్టీలోకి ఆహ్వానించే ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఈ క్రమంలోనే భువనగిరి టికెట్ రేసులో ఉన్న బీసీ నేతకు ప్రత్యామ్నాయంగా బీఆరెస్ నుంచి వంగాల వెంకన్న గౌడ్‌ను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం భువనగిరితో పాటు ఆలేరు, సికింద్రాబాద్, సనత్‌నగర్, నిజామాబాద్, ఆర్మూర్, కోదాడ వంటి స్థానాలు బీసీలకు కేటాయించాలన్న ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. దీంతో బీసీలకు వేటిని కేటాయించాలన్నదానిపై ఆ పార్టీలో విస్తృత కసరత్తు సాగుతున్నది.
డిక్లరేషన్‌తో మరో పేచీ
కాంగ్రెస్‌లో ఉదయ పూర్ డిక్లరేషన్ ఆధారంగా మరో పేచీ రేగింది. ఆ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో కనీసంగా ఐదేళ్ల పాటు పనిచేసిన వారికే పదవులు ఇవ్వాల్సి ఉంది. కానీ.. పీసీసీ ఎన్నికల కమిటీ భర్తీలో దానిని పాటించలేదని బీసీ వర్గాల నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఐదేళ్ల సర్వీస్ నిబంధనకు విరుద్ధంగా ప్రచార కమిటీ కో-కన్వీనర్‌ను చేశారని చెబుతున్న పలువురు నేతలు.. ఆయనకంటే ముందే పార్టీలో చేరిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులను ఎందుకు కమిటీలోకి తీసుకోలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చెరుకు సుధాకర్‌గౌడ్ వంటి బీసీ నాయకులు బహిరంగంగానే ఈ ప్రశ్నను సంధిస్తున్నారు. ఉదయ పూర్ డిక్లరేషన్‌లోని ‘పార్టీకి ఐదేళ్ల సర్వీస్ నిబంధన’ బీసీ, ఎస్టీ, ఎస్టీ నాయకులకేనా అంటూ నిలదీస్తున్నారు.
ఈ నేపథ్యంలో అటు బీసీలకు టికెట్లు, ఇటు ఐదేళ్ల సర్వీస్ నిబంధనలతో ఉదయ పూర్ డిక్లరేషన్ ఆసరాగా కాంగ్రెస్‌లో అంతర్గత రచ్చ నెలకొనగా, మున్ముందుకు మరెన్ని పేచీలకు కారణం అవుతోందో అన్న ఆందోళన మాత్రం పార్టీ పెద్దలను వేధిస్తున్నది.