Haryana
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ రక్షించలేమని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నుహ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణలు, ఆరుగురు చనిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజలంతా శాంతిసామరస్యాలను కాపాడాలని పిలుపునిచ్చారు. అయితే.. దీనికి ఆర్మీ, పోలీసులు సహా ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరన్నారు.
ప్రతి ఒక్కరినీ కాపాడడం సాధ్యం కాదని చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు చనిపోయారని, అందులో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారని సీఎం తెలిపారు. ఘర్షణలకు సంబంధించి.. 116 మందిని అరెస్టు చేశామని, మరో 190 మందిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. లూటీలు, ఆస్తి విధ్వంసానికి సంబంధించి.. దోపిడీలకు పాల్పడినవారి నుంచే వారికి పరిహారం అందుతుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఆస్తులకు వాటిల్లిన నష్టానికి మాత్రమే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని, ప్రైవేటు ప్రాపర్టీకి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పారు. ఈ విషయంలో గతంలోనే చట్టం ఆమోదించుకున్నామని గుర్తు చేశారు. అందుకే ప్రైవేటు ప్రాపర్టీకి కలిగిన నష్టాన్ని అందుకు కారకులైనవారి నుంచే ఇప్పిస్తామని చెప్పారు.