HomeLatest newsసారు చూపిన బాట‌లో సాగుదాం..(నేడు జ‌య‌శంక‌ర్ సార్ వ‌ర్ధంతి)

సారు చూపిన బాట‌లో సాగుదాం..(నేడు జ‌య‌శంక‌ర్ సార్ వ‌ర్ధంతి)

(నేడు ఆచార్య కొత్త ప‌ల్లి జ‌య‌శంక‌ర్ సార్ వ‌ర్ధంతి)

విధాత: తన గురించి కాకుండా సమాజం గురించి ఆలోచించడం కొంత‌మందికే సాధ్య‌మౌతుంది. అలాంటి వారు అరుదుగా ఉంటారు. ఆచార్య కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ సార్ ఆ కోవ‌కే చెందుతారు. సారు జీవిత కాలమంతా తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోస‌మే పోరాడారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఇచ్చిన అధికారిక‌ లెక్కల ఆధారంగానే ఒక శాస్త్రీయ ప‌ద్ధ‌తిలోఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను అంకెలతో సహా నాటి పాల‌కుల ముందుంచారు. ప్రత్యర్థులకు కూడా అర్థమయ్యేలా వివరించారు.

తాను విద్యార్థిగా ఉన్న 1952 నుంచి 2011 వరకు తెలంగాణ అన్న అందరితో కలిసి పనిచేశారు. తెలంగాణవాదానికి ఆయన భావజాల వ్యాప్తి ద్వారా ఒక రూపాన్ని ఇచ్చారు. రాష్ట్ర సాధన కోసం పోరాడేవారిలో ఎవరు నిలబడుతారు అనేది ఆలోచించలేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎప్పటికప్పుడు వలస పాలకు వివక్షను తన రచనలు, ప్ర‌సంగాల ద్వారా ఎండగట్టారు.

తెలంగాణ అన్న ప్రతి ఒక్కరితో కలిసి ప‌నిచేయ‌డం కూడా అందరితో అయ్యే పనికాదు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రం దాని ఆచరణలో చూపెట్టారు. ఫ‌జ‌ల్ అలీ క‌మిష‌న్ మొద‌లు శ్రీ‌కృష్ణ క‌మిటీ వ‌ర‌కు తెలంగాణ‌పై వేసిన అన్ని క‌మిటీల ముందు తెలంగాణ ఒక ప్ర‌త్యేక రాష్ట్రంగా ఎందుకు ఉండాలో త‌న వాద‌న‌ను స్ప‌ష్టంగా, బ‌లంగా వినిపించారు. రాష్ట్ర సాధన ఉద్యమానికి ముందు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సార్‌ను సేవలను ఎప్పుడూ స్మరించుకోవాలి. తెలంగాణపై ఆయన రాసిన వ్యాసాలు, చేసిన పరిశోధనలు రాష్ట్ర పునర్ నిర్మాణానికి కరదీపికలుగా పనిచేస్తున్నాయి.

ముందుగా అంద‌రూ ఎవ‌రి అభిప్రాయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఐక్యంగా పోరాడి తెలంగాణ సాధించుకోవాలి. అంత‌టితోనే అంతా అయిపోదు. రాష్ట్ర ఆవిర్భావం అనంత‌రం పున‌ర్ నిర్మాణ‌మే పెద్ద‌ప‌ని అని సారు అనేక సంద‌ర్భాల్లో చెప్పేవారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులన్నీ కాగితాలు, శిలాఫలాలకే పరిమితమయ్యాయి. తెలంగాణ ప్రాజెక్టులు అనగానే అంతర్రాష్ట్ర వివాదాలు, అటవీ చట్టాల దగ్గరే ఆగిపోతాయని ఉద్య‌మ కాలంలో సారు ప‌దే ప‌దే ప్ర‌స్తావించేవారు. దీనర్థం తెలంగాణ ప్రాజెక్టులు ఎన్నటికీ పూర్తి కావని. కానీ తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర‌ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను అధిగమించడానికి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టింది.

పక్కరాష్టా లతో సంప్రదింపులు చేపట్టి వారి అంగీకారంతో ఒప్పందాలు చేసుకుని కాళేశ్వ‌రం లాంటి భారీ ఎత్తిపోత‌ల ప్రాజెక్టును పూర్తి చేయ‌డంతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న‌ది. హైద‌రాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర‌తో క‌లిపి విలీనం చేసిన త‌ర్వాత ఈ ప్రాంతానికి జ‌రిగిన అన్యాయం వ‌ల్ల నాలుగు త‌రాలు తీవ్రంగా న‌ష్ట‌పోయాయి.

రేప‌టి తెలంగాణ‌లో యువ‌త‌కు, ముఖ్యంగా రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లంద‌రికీ ఆ ఫలాలు ద‌క్కాల‌న్నారు. గోదావ‌రి, కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌ న్యాయమైన వాటాను ద‌క్కించుకోవాలి. బీళ్లు వారిన నేల‌ల్లో ఆ నీళ్లు పారాలి. బోరుబావులు, క‌రెంటు కోత‌లతో కుదేలైన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తేవాలి. రైతు ఆత్మ‌హ‌త్య‌లు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాల‌ని స‌గ‌టు తెలంగాణ పౌరునిగా వ‌లె సారు కూడా కోరుకున్నారు.

ఈ ఎనిమిదేళ్ల కాలంలో నిజంగా సారు ఆశించినట్టుగా క‌రెంటు, నీళ్లు, నిధుల పంపిణీ, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో చాలా మార్పు వ‌చ్చింది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్న‌ది. ఎందుకంటే ఇవాల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం లాంటి పథకాల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు తెలంగాణ ఉద్యమానికి జాతీయస్థాయిలో ఒక అంగీకారం రావడంలో సార్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ‌కు స్వీయ రాజ‌కీయ అస్తిత్వం ఉండాల‌న్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమానికి విరామాలు వచ్చాయి కానీ విరమణ లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు.

మొదటి నుంచి తెలంగాణ అన్న ఒకే ఆకాంక్ష కోసం నిలబడ్డారు. అందుకోసమే తపించారు. అందుకే ఈసారి పోరాటం తెలంగాణ వచ్చేదాకా ఆగదు అన్న విశ్వాసం ఆయనలో బలంగా ఉండేది. ఆయన నమ్మకం నిజమైంది. తెలంగాణ రాష్ట్రం ఒక రాజ‌కీయ డిమాండ్‌. ఆ అనివార్యత‌ను ఒక్క‌డి ప్ర‌జ‌లు, రాజ‌కీయ నాయ‌క‌త్వం సృష్టిస్తే.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంక‌ల్పం వ‌ల్ల‌ దశాబ్దాల తెలంగాణ ప్ర‌జ‌ల‌ క‌ల నెర‌వేరింది. రాష్ట్రం ఏర్ప‌డ‌క‌ముందే సార్ క్యాన్సర్‌తో క‌న్నుమూయ‌డం తెలంగాణ స‌మాజానికి పెద్ద‌లోటు.

ఉద్య‌మ కాలంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా సారు లాంటి వారి వ‌ల్ల ఒక్క‌తాటిమీదికి వ‌చ్చారు. రాష్ట్ర సాధ‌న‌లో క‌లిసి న‌డిచిన‌ట్టే పున‌ర్ నిర్మాణంలోనూ అంద‌రినీ క‌లుపుకుని పోవాల్సిన బాద్య‌త నేటి పాల‌కుల‌పై ఉన్న‌ది. సార్ చెప్పిన‌ట్టు పోరాటం ఇంకా అయిపోలేదు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందో దాన్ని సమిష్టిగా పూర్తిచేయడమే సారు చూపిన బాటే అనుసరణీయం. అదే ఆయనకు మనమిచ్చే నివాళి.

-ఆసరి రాజు

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!