విధాత : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి ఆర్కే రోజా శనివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేష్ వైఖరి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఉందని విమర్శించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తుంటే ప్రజలు హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారని రోజా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, సంక్షేమ పథకాలకు కోత పెట్టకుండా ప్రజలకు ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, లోకేష్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు.
పదో తరగలి పరీక్ష ఫలితాలపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. మహానాడులో తొడగొట్టి రమ్మని పిలిచిన టీడీపీ నాయకులు.. లోకేష్ జూమ్ మీటింగ్కు కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. కోవిడ్ కారణంగా పిల్లలు సరిగా చదువుకోకపోవడం వల్లే ఉత్తీర్ణత తగ్గిందన్నారు. లోకేష్ జీవితంలో అసెంబ్లీలోకి రాలేడని అన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీని మూసేస్తామని అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్నారని.. అయితే 2019 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలు టీడీపీ ఓడిపోతోందని మంత్రి రోజా అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ పాకులాడుతుంటారని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణాలో భూస్థాపితం అయినా టీడీపీ, ఏపీలో మూతపడటం ఖాయంమని రోజా జోస్యం చెప్పారు.
మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ నిర్వాకం
తిరుమల శ్రీవారి ఆలయంలో మరోసారి నిఘా వైఫల్యం బట్టబయలైంది. నిన్న ప్రముఖ నటి నయనతార చెప్పులు వేసుకుని మాడవీధుల్లో తిరిగిన ఘటన మరువక ముందే ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. సదరు వ్యక్తి మంత్రి రోజా ఎస్కార్డ్ డ్రైవర్గా టీటీడీ సిబ్బంది గుర్తించింది. సంప్రదాయ దుస్తులు లేకుండా మహాద్వారం నుంచి ఆలయంలోకి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ ప్రవేశించాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన టీటీడీ సిబ్బంది..డ్రైవర్ను పడికావలి నుంచి వెనక్కి పంపించివేశారు. డ్రైవర్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినా వెళ్లలేదంటూ మంత్రి చెప్పారు. కొన్ని చానెల్స్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తన సిబ్బంది ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడు నడుచుకోలేదంటూ సమర్ధించుకున్నారు. రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ను విజువల్స్ తీసేందుకు ప్రయత్నించిన మీడియాను రోజా సిబ్బంది అడ్డుకుంది.