విధాత: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశుని దర్శనానికి భక్తజనం క్యూ కడుతున్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో ఏడు కొండలపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో నిండి పోయాయి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూలైన్లు రాంభగీచ వరకు చేరుకున్నాయి. మరోవైపు నడక మార్గం గుండా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
భక్తుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. తిరుమలకు విచ్చేసిన భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. నడక మార్గంలో తిరుమలకు వస్తున్న భక్తులకు మోకాళ్లమెట్టు ప్రాంతంలో ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఊహించని స్థాయిలో భక్తులు కొండకు రావడంతో సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతున్నది.
అదనపు క్యూ లైనులు: ఈవో
తిరుమలలో క్యూ లైన్ లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. భక్తుల తాకిడి దృష్ట్యా అదనపు క్యూ లైనులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆళ్వార్ ట్యాంక్ చుట్టూ అదనపు క్యూ లైనులను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.