అమ్మాయితో వివాహానికి అంగీకరించలేదని ఆమె కుటుంబ సభ్యులపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఆరుగురిపై అతి సమీపం నుంచి కాల్పులు జరుపగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు

- ఇద్దరు మృతి.. అమ్మాయిసహా నలుగురుకి తీవ్ర గాయాలు
విధాత: అమ్మాయితో వివాహానికి అంగీకరించలేదని ఆమె కుటుంబ సభ్యులపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఆరుగురిపై అతి సమీపం నుంచి కాల్పులు జరుపగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అమ్మాయి సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప దవాఖానకు, అనంతరం పాట్నాలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు లవ్ ఎఫైర్ కారణమని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. లఖిసరాయి జిల్లా పంజాబి మొహల్లా ప్రాంతానికి చెందిన ఆశిష్‌చౌదరి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ, ఆశిష్‌తో అమ్మాయికి వివాహం జరిపేందుకు ఆమె కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో అమ్మాయి కుటుంబంపై కక్ష పెంచుకున్న ఆశిష్ వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు.
ఆదివారం పంజాబ్‌లో చాత్ పూజ నిర్వహించి వాహనంలో సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చిన అమ్మాయి కుటుంబ సభ్యులపై అతడు సమీపం నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన అమ్మాయి సహా నలుగురిని దవాఖానకు తరలించారు. నిందితుడు నేరానికి ఉపయోగించి ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
