Vote Chori | బీహార్‌లో బీజేపీ ‘ఓటు చోరీ’..! కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించిన ఈ గ‌ణాంకాలే నిద‌ర్శ‌నం..!

Vote Chori | కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఆరోపిస్తున్న‌ట్లు ఈ దేశంలో నిజంగానే ఓటు చోరీ( Vote Chori ) జ‌రిగిందా..? అంటే అవున‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఎందుకంటే తాజాగా జ‌రిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో( Bihar Assembly Elections ) ఈ ఓటు చోరీ స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30వ తేదీన‌, న‌వంబ‌ర్ 11వ తేదీన కేంద్రం ఎన్నిక‌ల సంఘం( Election Commission of India ) విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. బీహార్‌లో మొత్తం ఓట్లే 7.42 కోట్లు కోగా, పోలైన ఓట్లేమో 7.45 కోట్లు. అంటే 100 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

  • By: raj |    national |    Published on : Nov 14, 2025 11:59 PM IST
Vote Chori | బీహార్‌లో బీజేపీ ‘ఓటు చోరీ’..! కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించిన ఈ గ‌ణాంకాలే నిద‌ర్శ‌నం..!

Vote Chori | బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో( Bihar Assembly Elections ) ఎన్డీయే( NDA ) కూట‌మి క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో భారీ విజ‌యం సాధించింది. మొత్తం 243 స్థానాల‌కు గానూ ఎన్డీఏ కూట‌మి 202 స్థానాల్లో గెలుపొందింది. మ‌హాఘ‌ట్‌బంధ‌న్( Mahagathbandhan ) 35 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. ఇత‌రులు ఆరు స్థానాల్లో విజ‌యం సాధించారు. ఈ గెలుపోట‌ముల‌ను ప‌క్క‌న పెడితే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల‌కు సంబంధించి ఈ దేశ ప్ర‌జ‌లు, మేధావులు ఆలోచించ‌ద‌గ్గ అంశం ఒక‌టి వెలుగు చూసింది. ఈ అంశంపై మీరు కూడా దృష్టి సారిస్తే.. నిజ‌మే క‌దా..? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతుంది. దేశంలో వ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీ( BJP ).. కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని, ఈ దేశ ప్ర‌జ‌ల‌ను ఎలా మానిపులేట్ చేస్తుంద‌న‌డానికి ఈ గ‌ణాంకాలే నిద‌ర్శ‌నం.

ఎందుకంటే.. బీహార్ ఎన్నిక‌లకు సంబంధించిన ఓట‌రు జాబితాను, పోలైన ఓట్ల సంఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే బీజేపీ ఓటు చోరీకి పాల్పడింద‌నేది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అదేదో మ‌నం గుడ్డిగా అంకెలు చెబుతూ బీజేపీని త‌ప్పుప‌ట్ట‌డం లేదు. సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ల‌లోని గ‌ణాంకాలే ఓటు చోరీ జ‌రిగింద‌ని వెల్ల‌డిస్తున్నాయి.

అస‌లేం జ‌రిగిందంటే..?

2025 సెప్టెంబ‌ర్ 30వ తేదీన కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. దేనికి సంబంధించి అంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న ఓట‌ర్ల జాబితా గురించి. అయితే 2025 జూన్ 24 నాటికి 7.89 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్న‌ట్లు పేర్కొంది. ప‌రిశీల‌న అనంత‌రం 65 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించామ‌ని, ఆ త‌ర్వాత 2025 ఆగ‌స్టు 1వ తేదీ నాటికి 7.24 కోట్ల మంది ఓట‌ర్ల‌తో జాబితాను రూపొందించిన‌ట్లు పేర్కొంది. ఈ డ్రాఫ్ట్ జాబితా నుంచి 3.66 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ను మ‌ళ్లీ తొల‌గించారు. ఫామ్ 6 కింద మ‌ళ్లీ డ్రాఫ్ట్ జాబితాకు 21.53 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను చేర్చారు. మొత్తంగా 2025 సెప్టెంబ‌ర్ 30 నాటికి 7.42 కోట్ల మంది ఓట‌ర్లు బీహార్‌లో ఉన్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా విడుద‌ల చేసిన ప్రెస్‌నోట్‌లో పొందుప‌రిచారు.

ఈ గ‌ణాంకాలే నిద‌ర్శ‌నం..!

ఇక బీహార్ అసెంబ్లీకి రెండు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. 2025 నవంబ‌ర్ 11వ తేదీన రెండు ద‌శ‌ల‌కు సంబంధించిన ఓటింగ్ శాతం వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ప్రెస్ నోట్ రూపంలో విడుద‌ల చేసింది. తొలి విడుత‌లో పురుష‌, మ‌హిళా ఓట‌ర్లు క‌లిసి 3.75,1,302 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకున్నారు. అంటే ఫ‌స్ట్ ఫేజ్‌లో 65.08 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. రెండో విడ‌త‌లో 3,70,13,556 మంది ఓటు హ‌క్కును వినియోగించుకోగా, 68.76 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు తెలిపింది. మొత్తంగా రెండు ద‌శ‌ల్లో క‌లిపి 7,45,26,858 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు విడ‌త‌ల్లో క‌లిపి 66.91 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారికంగా వెల్ల‌డించింది.

మొత్తం ఓట్ల కంటే పోలైన ఓట్లే ఎక్కువ‌..!

మ‌రి బీహార్‌లో మొత్తం ఓట్లే 7.42 కోట్లు. పోలైన ఓట్లేమో 7.45 కోట్లు. అంటే 100 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన గ‌ణాంకాల‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. అంటే ఈ లెక్క‌ల‌ను చూస్తుంటే చిన్న పిల్లాడికి కూడా అర్థ‌మ‌వుతుంది.. బీహార్‌లో ఓటు చోరీ జ‌రిగిందని. ఓటు చోరీనే కాదు.. ప్ర‌జాతీర్పునే బీజేపీ నేత‌లు చోరీ చేశార‌ని తేట‌తెల్ల‌మ‌వుతుంది.

బీజేపీపై కాంగ్రెస్ యుద్ధం చేయాల్సిందే.. ఐఎల్‌పీఏ డిమాండ్

ఈ క్ర‌మంలో ఇండియ‌న్ లీగ‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ అసోసియేష‌న్( ILPA ) తీవ్రంగా స్పందించింది. బీజేపీ నాయ‌క‌త్వం బీహార్‌లో ఓట్ల చోరీకి పాల్ప‌డింద‌ని ధ్వ‌జ‌మెత్తింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించిన గ‌ణాంకాలు వాస్త‌వ‌మైతే.. ఈవీఎంల ద్వారా ఓట్లు గోల్ మాల్ అయ్యాయ‌ని, ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయింద‌ని భావించాల్సిందే అని పేర్కొంది. బీహార్‌లో జ‌రిగిన ఓటు చోరీపై ఏన్డీయేత‌ర రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాస్వామిక వాదులు దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాలి. బీజేపీ ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టించి, ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న‌ల‌కు దిగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని తెలిపింది. బీహార్ ఎన్నిక‌ల ర‌ద్దుకు తీవ్రంగా ఉద్య‌మించాలి. అంతేకాకుండా ప్ర‌స్తుత ఎన్నిక క‌మిష‌న్‌ను ర‌ద్దు చేసి కొత్త క‌మిష‌న్‌కు డిమాండ్ చేయాల‌ని తెలిపింది. కొత్త ఓట‌రు జాబితా త‌యారు చేసి.. బ్యాలెట్ ప‌ద్ధ‌తిలోనే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న డిమాండ్‌ను తెర‌పైకి తేవాలి. బీజేపీపై యుద్ధం కోసం కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే నాయ‌క‌త్వం వ‌హించాల‌ని డిమాండ్ చేసింది.. లేదంటే ఇదే ప‌రిస్థితి రేపు అన్ని రాష్ట్రాల్లో ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ఏమాత్రం ఆల‌స్యం చేయకుండా ఉద్య‌మించాల‌ని ఇండియ‌న్ లీగ‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ అసోసియేష‌న్ ప్ర‌జాస్వామివాదుల‌ను, మ‌రి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కోరింది.