ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు పది రోజుల తర్వాత తొలిసారిగా కనిపించారు. పైపు ద్వారా పంపించిన కెమెరా వారి ఫొటోలను తీసింది

- పది రోజుల తర్వాత తొలిసారిగా కనిపించిన కార్మికులు
- పైపు ద్వారా సొరంగం లోపలికి కెమెరా పంపి ఫొటోలు
- కార్మికులకు వేడి ఆహార పదార్థాలు కూడా చేరవేత
- వాకీ టాకీతో కార్మికులతో మాట్లాడిన అధికారులు
విధాత: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులు పది రోజుల తర్వాత తొలిసారిగా కనిపించారు. పైపు ద్వారా పంపించిన కెమెరా వారి ఫొటోలను తీసింది. తొలిసారిగా మంగళవారం కార్మికుల ఫొటోలు బయటకు వచ్చాయి. కూలిన సొరంగం లోపలికి ఆరు ఇంచుల పైప్‌ను అధికారులు పంపారు.
సోమవారం రాత్రి ఆ పైప్ ద్వారానే కార్మికులకు ఆహార పదార్థాలను చేరవేశారు. మంగళవారం ఉదయం అదే పైపు ద్వారా కెమెరాను లోపలికి పంపించి కార్మికుల ఫొటోలు తీశారు. కార్మికుల క్షేమ ఫొటోలను అధికారులు బహిర్గత పరిచారు. రెస్క్యూ అధికారులు వాకీ టాకీ ద్వారా కొంతమంది కార్మికులతో కూడా మాట్లాడారు.
సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో ఈ నెల 12వ తేదీ నుంచి 41 మంది కార్మికులకు సొరంగంలోనే చిక్కుకుపోయారు. నాటి నుంచి వారి ఆచూకీ, రక్షణ కోసం రెస్క్యూ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆహారాన్ని పంపేందుకు గత రాత్రి ఆరు ఇంచు పైపును సొరంగంలోకి పంపించారు. ఆ పైపు ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను సొరంగం లోపలికి పంపారు.
విజువల్స్‌లో కార్మికులు హార్డ్ టోపీలు ధరించి, కెమెరాకు చేతులు ఊపుతూ కనిపించారు. తాము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బాగానే ఉన్నామని తెలిపారు. రెస్క్యూ అధికారులు, వాకీ టాకీస్, రేడియో హ్యాండ్‌సెట్‌ల ద్వారా కార్మికులతో మాట్లాడటం, కెమెరా ముందుకు రావాలని కార్మికులను కోరడం వీడియోలో కనిపించింది. గత రాత్రి గాజు సీసాల్లో కిచిడీని పైపు ద్వారా రెస్క్యూ అధికారులు పంపగా, కార్మికులు 10 రోజుల తర్వాత తొలిసారి వేడి భోజనం కూడా చేశారు. ఇప్పటి వరకు డ్రై ఫ్రూట్స్, నీళ్లతోనే బతుకుతున్నారు.
రెస్క్యూ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జ్ అధికారి కల్నల్ దీపక్ పాటిల్ మాట్లాడుతూ.. కార్మికులకు త్వరలో మొబైల్స్, చార్జర్లను పైపు ద్వారా పంపిస్తామని చెప్పారు. వారంతా క్షేమంగా ఉన్నారని, త్వరలోనే వారిని కాపాడతామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కార్మికుల వీడియోను షేర్ చేశారు.
