రుతువుల రాణి వసంతకాలం. శీతాకాలంలో చెట్ల ఆకులు రాలిపోతుండగా.. వసంతంలో చెట్లు చెరుగించి.. పూలు పరమళిస్తాయి.

Garden Tourism Festival | రుతువుల రాణి వసంతకాలం. శీతాకాలంలో చెట్ల ఆకులు రాలిపోతుండగా.. వసంతంలో చెట్లు చెరుగించి.. పూలు పరమళిస్తాయి. ఈ సమయంలో ప్రకృతి అందాలను పర్యాటకులను మమైరిపిస్తుంటాయి. ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చలి నుంచి ఉపశమనం కలిగిస్తుండగా.. ప్రకాశవంతమైన సూర్యకాంతి మనసును ఆకర్షిస్తూ ఉంటుంది. వసంతంలో చెట్లు, మొక్కల రంగుగంగుల పూలతో నిండిపోయి చూపరులను ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా పూల చెట్ల గురించి చెప్పాల్సిన పని లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో అమృత్‌ గార్డెన్‌తో పాటు మరో ఆహ్లాదకరమైన ప్రదేశం మరొకటి సైతం ఉన్నది. ఇందులో విభిన్న రకాల మొక్కలు పర్యాటకులను చూపుతిప్పుకోనివ్వదు. అదే గార్డెన్‌ టూరిజం ఫెస్టివల్‌. ఢిల్లీలో గార్డెన్‌ టూరిజం ఫెస్టివల్‌ ఈ నెల 16న ప్రారంభమై 18 వరకు కొనసాగుతున్నది. మూడురోజుల పాటు ఇందులో పర్యాటకులు విభిన్న రకాల పూలు, మొక్కలను వీక్షించేందుకు అవకాశం కలుగనున్నది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ ప్రియులకు ఈ టూరిజం ఫెస్టివల్‌ చెప్పలేని అనుభూతినిస్తుంది. దాంతో పాటు విభిన్న రకాలకు చెందిన వంటకాలను సైతం టేస్ట్‌ చేసే అవకాశం దక్కనున్నది.

ఢిల్లీ టూరిజం ఆధ్వర్యంలో..

ఈ గార్డెన్‌ ఫెస్టివల్‌లో ఢిల్లీ ప్రభుత్వంలోని టూరిజం విభాగం నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఫెస్టివల్‌ను నిర్వహిస్తూ వస్తుంది. ఇందులోని ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన పలు రకాల పువ్వులు, మొక్కలను ప్రదర్శిస్తారు. పర్యాటకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌తో పోటీలు సైతం చేపడుతారు. దాంతో పాటు విభిన్న రకాల వంటకాలు, పానియాలు సైతం అందుబాటులో ఉంటాయి.

తొలిసారిగా గార్డెన్‌ టూరిజం 2004లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ప్రారంభించారు. పర్యావరణం, ఉద్యానవనాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఫెస్టివల్‌ను ప్రభుత్వం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ఫెస్టివల్‌ ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంటుంది. కుతుబ్‌ హెరిటేజ్‌ జోన్‌ సమీపంలో ఉన్న 20.5 ఎకరాల ఉద్యానవనంలో గార్డెన్‌ ఆఫ్‌ ఫైవ్‌ సెన్సెస్‌లో జరుగుతుంది.

మూడు రోజుల పాటు..

టూరిజం ఫెస్టివల్‌ 36వ సీజన్‌ కాగా.. ఈ నెల 16 నుంచి 18 వరకు కొనసాగనున్నది. ‘పువ్వుల మధ్య భూమి నవ్వుతుంది’ థీమ్‌తో ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నది. టూరిజం ఫెస్టివల్‌లో అందమైన వివిధ రకాల పుష్పాలను చూసే వీలు పర్యాటకులకు కలుగుతుంది. డహ్లియాస్, టెర్రిరియంలు, ఔషధ మొక్కలు, కాక్టస్, బోన్సాయ్, బోగెన్‌విల్లా, కూరగాయల మొక్కలు, ఇండోర్, అవుట్‌డోర్ మొక్కలను సైతం ప్రదర్శిస్తారు.

దాదాపు 500కుపైగా మొక్కలు చూసే అవకాశం ఉంటుంది. వీటిని చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. పిల్లల కోసం అడ్వెంచర్ పార్క్ సైతం ఏర్పాటు చేస్తారు. 17న పిల్లలకు పెంటింగ్‌ పోటీలు, 18న మ్యాజిక్‌ షో ఉంటుంది. అలాగే, ఆసక్తి ఉన్న వారు వర్క్‌షాప్‌లో సైతం పాల్గొనేందుకు వీలుంటుంది.

మినీ ఫుడ్‌ ఫెస్టివల్‌లో వివిధ రకాల వంటకాలను ఆస్వాదించొచ్చు. మూడు రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫెస్టివల్‌ కొనసాగుతుంది. సాధారణ రోజుల్లో ఎంట్రీ టికెట్‌ ధర ఒక్కొక్కరికి రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. వారాంతాల్లో రూ.50గా నిర్ణయించారు. 12 సంవత్సరాల్లోపు పిల్లలతో పాటు సీనియర్‌ సిటజన్లకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు.

Updated On 13 Feb 2024 4:41 AM GMT
Somu

Somu

Next Story