Gas Shortage In India | గ్యాస్ కొరత వేళ..నాలుగు రకాల గ్యాస్ వైరల్ !

దేశంలో గ్యాస్ కొరత వేళ.. ఎల్పీజీ, పీఎన్జీ, సీఎన్జీ, ఎల్ఎన్జీ గ్యాస్ రకాలు సామాన్య జనంలో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ గ్యాస్ ఎన్నిరకాలుగా అందుబాటులో ఉన్నాయి..వాటిని ఎలా సరఫరా చేస్తారు.. ఎందుకోసం వినియోగిస్తారు అన్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 14, 2026, 1:51 pm IST
Read Time: 16 mins
Gas Shortage In India | గ్యాస్ కొరత వేళ..నాలుగు రకాల గ్యాస్ వైరల్ !

విధాత : ఇరాన్ యుద్దంతో పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులలో నెలకొన్న ఆటంకాలతో ప్రపంచ దేశాలు ఇంధన సమస్యను ఎదుర్కొంటున్నాయి. భారత్ లో వంట గ్యాస్ సరఫరా తీవ్రతరమైందన్న ప్రచారంతో ప్రజలు ముందస్తుగా గ్యాస్ బుకింగ్ చేస్తుండటంతో సమస్య అధికమైంది.

ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్యపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఎల్పీజీ గ్యాస్ కొరతకు ఇబ్బంది లేదని, సరిపడ నిల్వలు ఉన్నాయని, కొత్తగా 30శాతం మేరకు అదనంగా ఉత్పత్తి కూడా పెంచామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ప్రకటించారు. ఇరాన్ నుంచి మన దేశానికి ఇంధన నౌకలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయని వెల్లడించింది. అయినప్పటికి ప్రజలు మాత్రం ఎల్పీజీ గ్యాస్ కోసం ఎగబడుతున్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ ప్రకటన ప్రజల్లో ఆసక్తిరేపింది.

ఎల్పీజీ గ్యాస్ ఇబ్బందులను అధిగమించే క్రమంలో పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) నెట్ వర్క్ లకు దగ్గరున్న 60లక్షల ఇళ్లు పీఎన్జీకి మారాలని సూజాత శర్మ సూచించారు. ఈ సందర్బగా ఎల్పీజీ, పీఎన్జీ, సీఎన్జీ, ఎల్ఎన్జీ గ్యాస్ రకాలు సామాన్య జనంలో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ గ్యాస్ ఎన్నిరకాలుగా అందుబాటులో ఉన్నాయి..వాటిని ఎలా సరఫరా చేస్తారు.. ఎందుకోసం వినియోగిస్తారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

నాలుగు రకాల గ్యాస్ లు..వేర్వేరు ఉపయోగాలు

దేశంలో ఎల్పీజీ(LPG), సీఎన్జీ(CNG), పీఎన్జీ(PNG), ఎల్ఎన్జీ(LNG) అనే నాలుగు రకాల గ్యాస్ లు వివిధ రకాల వినియోగాలకు ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. ఆ నాలుగు రకాల(వాయువు) గ్యాస్ లను వేర్వేరు పద్ధతుల్లో ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం జరుగుతుంది. స్థానిక అసవరాలు, భద్రత, సరఫరా వంటి అంశాల నేపథ్యంలో వాటిని వినియోగిస్తుున్నారు.

లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG):

గృహా అవసరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ వంటి వాటిలో వాడే డోమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లలో ఎల్పీజీ(LPG) ఉంటుంది. ఈ గ్యాస్ ను ద్రవరూపంలో సిలిండర్లలో నిల్వ చేసి సరఫరా చేస్తారు. ఈ గ్యాస్ లో ప్రధానంగా ప్రొపేన్, బ్యూటేన్ వాయువులు ఉంటాయి. ముడి చమురు శుద్ధి చేసే సమయంలో దీనిని తయారు చేస్తారు. దీనిని లిక్విడ్ రూపంలో సిలిండర్లలో నింపుతారు. మనం సాధారణంగా చూసే ఎరుపు, నీలం కలర్ సిలిండర్లలో ఈ ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేస్తారు.

ఎల్పీజీ గ్యాస్ గాలి కన్నా ఎక్కువ బరువుగా ఉంటుంది. లీక్ అయితే ఉపరితలంపై వేగంగా విస్తరిస్తుంది. వేగంగా మండే స్వభావం ఎక్కువ. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీని వాహనాలకు ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. మన దేశం ఇలా వాడటం తక్కువ.

కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG):

సీఎన్జీ గ్యాస్ అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ . ఇది ప్రధానంగా మీథేన్ (CH4) వాయువును కలిగి ఉంటుంది. సహజవాయువుల్లో ఎక్కువ వినియోగం సీఎన్జీ దే కావడం విశేషం. సీఎన్జీని అధిక పీడనం(200–250 బార్) వద్ద సిలిండర్లలో నింపుతారు. ఎల్పీజీ లాగా ఇది ద్రవరూపంలో కాకుండా వాయురూపంలో ఉంటుంది. సీఎన్జీని ప్రధానంగా ఆటో-రిక్షాలు, టాక్సీలు, బస్సులు, కార్లు వంటి వాహనాలలో వినియోగిస్తారు. ఇది పెట్రోల్, డీజిల్ కన్నా చౌకగా లభిస్తుండటం.. తక్కువ పొగను విడుదల చేస్తుండటంతో దీని వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది.

పైప్డ్ నేచురల్ గ్యాస్(PNG): 

పీఎన్జీ గ్యాస్ అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్. దీనిని పైప్ లైన్ ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. సీఎన్జీ గ్యాస్ మాదిరిగానే ఇందులో కూడా ప్రధానంగా మీథేన్ వాయువును కలిసి ఉంటుంది. ఓ రకంగా ఇది సీఎన్జీ లాంటిదే. కానీ తక్కువ పీడనంతో పైప్‌లైన్ ద్వారా ఇళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలకు సరఫరా చేయబడుతుంది. సరఫరా కాబడుతున్న పరిమాణాన్ని గణించేందుకు మీటర్లు అమర్చుతారు. వినియోగదారులు వాడుకున్న గ్యాస్‌కు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పీఎన్జీ గ్యాస్ గాలి కంటే తేలికగా ఉండి, లీకైతే పైకి ఎగిసి పడుతుంది. మంటలు చెలరేగే ప్రమాదం తక్కువగా ఉంటుంది. సీఎన్జీ, పీఎన్జీల గ్యాస్ ల మధ్య తేడాలు కేవలం వాటి నిల్వ..సరఫరా పద్దతులలో మాత్రమే తేడా ఉంటుంది.

ద్రవీకృత సహజ వాయువు(LNG):

ఎల్ఎన్జీ అంటే ద్రవీకృత సహజ వాయువు. ఇది కూడా ఒక రకమైన మీథేన్ వాయువు, కానీ దానిని చాలా తక్కువ ఉష్ణోగ్రతకు (-162 డిగ్రీల సెల్సియస్) చల్లబరచడం ద్వారా ద్రవ స్థితికి మార్చబడుతుంది. ఈ ప్రక్రియ దీని పరిమాణాన్ని 600 రెట్లు తగ్గిస్తుంది. దీంతో పెద్ద ఓడల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రవాణ చేయడానికి వీలు అవుతుంది. ఓడరేవులకు చేరుకున్న తర్వాత దీనిని వాయు స్థితిలోకి మారుస్తారు. ఆ తర్వాత పైప్ లైన్స్, ట్రక్కుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలకు తరలిస్తారు. భారీ ట్రక్కుల్లో దీనిని ఇంధనంగా వాడుతారు. భారత్ లో యూరియా వంటి ఎరువుల తయారీ రంగం ప్రధాన వనరుగా ఎల్ఎన్జీనే కావడం గమనార్హం.

యుద్దంతో యూరియా కంపెనీల మూత

ఎల్ఎన్జీ అధిక భాగం పశ్చిమాసియా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. యుద్ద ప్రభావంతో దిగుమతులలో నెలకొన్న ఆటంకాలతో దేశంలోని ఎరువుల పరిశ్రమలు మూతపడే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద యూరియా ఉత్పత్తి సంస్థ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కార్పోరేషన్ లిమిటెడ్ సహా అనేక యూరియా ప్లాంట్లు మూతపడ్డాయి. దేశీయ ఎరువుల పరిశ్రమకు అసరమైన ఎల్ఎన్జీ ప్రస్తుతం 70శాతం మేరకు మాత్రమే అందుబాటులో ఉంది. దీర్ఘకాలం యుద్దం కొనసాగితే భారతీయ ఎరువుల పరిశ్రమలు మూతపడి యూరియా కొరత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా దిగుమతిదారుగా భారత్ కొనసాగుండటం గమనార్హం. ఎక్కువ కాలం ఎల్ఎన్జీ సరఫరా ఆగిపోతే విదేశాల నుంచి యూరియా కొనుగోళ్లు పెంచక తప్పదు. దీంతో దేశీయంగా యూరియా కొరత, సబ్సిడీల భారం , ధరలు పెరుగడం వంటి సమస్యలు తలెత్తె ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇంధన దిగుమతుల తగ్గింపుకు కేంద్రం కసరత్తు

దేశంలో ఇంధన దిగుమతులను తగ్గించి, ఆత్మనిర్భర్ భారత్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రభుత్వం మిథనాల్ , ఇథనాల్ ఆధారిత ఇంధనాల ఉత్పత్తులను పెంచుతుంది. ఇటీవల అస్సాం పెట్రోకెమికల్స్‌లో 500 టీపీడీ మిథనాల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పెట్రోల్‌లో 15% మిథనాల్‌ను (ఎం15) కలపడం ద్వారా ఇంధన భద్రతను పెంచడం, చమురు బిల్లులను తగ్గించడం లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించారు. బొగ్గు, బయోమాస్ నుండి మిథనాల్‌ను ఉత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అలాగే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఏటా రూ. 5000 కోట్లకు పైగా ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేస్తుంది. ఈ చర్యల ద్వారా భారతదేశం తన ఇంధన అవసరాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటం కొంత మేరకు తగ్గనుంది.

విమానాల్లో వాడే ఇంధనం మరో రకం..అదే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఫ్యూయల్ అనేది గ్యాస్-టర్బైన్ ఇంజిన్‌లతో నడిచే విమానాల్లో ఉపయోగించే అత్యంత నాణ్యమైన, రంగులేని పెట్రోలియం ఆధారిత ఇంధనం. వాణిజ్య విమానాలు, జెట్ విమానాలు, టర్బోప్రాప్ విమానాలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా జెట్ A మరియు A-1, జెట్-B రకాలుగా ఉంటుంది. Jet A/A-1 రకాన్ని ఎక్కువగా పౌర విమానయానంలో వినియోగిస్తారు. Jet B రకాన్ని చల్లని వాతావరణంలో ఉపయోగించే ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఫ్యూయల్ కిరోసిన్ తరహాలో ఉంటుంది. అధిక ఫ్లాష్ పాయింట్ కలిగి ఉండటం వల్ల సురక్షితమైనదిగా భావిస్తుంటారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల వద్ద కూడా గడ్డకట్టకుండా ఉండేలా, యాంటీ-ఐసింగ్ (anti-icing) లక్షణాలను కలిగి ఉంటుంది.

ఏటీఎఫ్ ఇంధన కొరతతో విమాన యాన సంస్థల సర్ చార్జ్

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఫ్యూయల్ విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులో సుమారు 50% ఆక్రమిస్తుంది. దీని ధరలు పెరిగితే విమాన టికెట్ల ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో విమాన టిక్కెట్లపై ‘ఫ్యూయల్ సర్ చార్జ్ ‘ విధించడంతో టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. విమాన ఇంధనం (ATF) ధరలు పెరిగిపోవడంతో విమానయాన సంస్థలు టికెట్ ధరలపై ఇంధన సర్ చార్జ్ లను విధిస్తున్నారు. సన్నద్ధమవుతున్నాయి.

భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

తాజాగా ఇండిగో (IndiGo)సంస్థ ఒక్కో టిక్కెట్‌పై రూ.425 నుంచి రూ.2,300 వరకూ అదనపు భారం వేసింది. తాజా ఛార్జీలు మార్చి 14 నుంచి అమల్లోకి వస్తాయని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మద్యప్రాచ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఇంధనం ధరలు పెరగడంతో సర్‌ఛార్జి నిర్ణయం తీసుకున్నట్టు ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంధనం ధరల్లో పెరుగుదల 85 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ జెట్ ఫ్యూయల్ మోనిటర్‌ తెలిపినట్టు పేర్కొంది.

దేశీయ ప్రయాణం టిక్కెట్లపై రూ.425 వసూలు చేస్తారు. మధ్యప్రాచ్యం వెళ్లే విమాన టిక్కెట్‌పై రూ.900, చైనా, ఆగ్నేయాసియా వెళ్లే విమానాలకు రూ.1,800, ఆఫ్రికా, పశ్చిమాసియాకు వెళ్లే విమానాలకు రూ.1,800, యూరప్ వెళ్లే విమానాలకు రూ.2,300 చొప్పున ఫ్యూయల్ చార్జీలు వసూలు చేస్తారు.

ఇవి కూడా చదవండి :

LPG Booking Complaints | గ్యాస్ సిలిండర్ అందలేదా ?..ఈ నెంబర్లకు ఫోన్ చేయండి!
దేశంలో వంటగ్యాస్‌ కొరత లేదు: కేంద్రం కీలక ప్రకటన