
- ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర పరాజయానికి ప్రధాని నరేంద్రమోదీయే కారణమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆయనను దురదృష్టవంతుడిగా అభివర్ణించారు. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియానికి ఆయన హాజరు కావడం వల్లే మ్యాచ్ ఓడిపోయామని అన్నారు. మంగళవారం ఆయన రాజస్థాన్‌లో ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో కొందరు ‘పనౌటి’ (దురదృష్టవంతుడు) అంటూ వ్యాఖ్యలు చేయడంపై రాహుల్ స్పందిస్తూ.. ‘అవును.. దురదృష్టవంతుడు.. దురదృష్టవంతుడు. మనవాళ్లు చాలా ఈజీగా ప్రపంచకప్ గెలిచి ఉండేవారు.
కానీ.. ఒక అపశకునం దానిని అడ్డుకున్నది. ఈ విషయం ప్రజలకు తెలియాలని మీడియా అనుకోలేదు’ అన్నారు. ప్రధాని పేరును రాహుల్ నేరుగా ప్రస్తావించకపోయినా.. ప్రపంచకప్ మ్యాచ్ సమయంలో మోదీ స్టేడియానికి హాజరైన సంగతి తెలిసిందే. మోదీ రాకపై సోషల్ మీడియాలోనూ నానా రచ్చ జరిగింది. దురదృష్టవంతుడు వస్తే.. మ్యాచ్ కష్టమేనని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే దానిని క్యాష్ చేసుకోవడానికే మోదీ అక్కడి వచ్చారన్న చర్చ కూడా నడిచింది. సాధారణంగా కొన్ని సందర్భాల్లో ప్రధాని వంటిస్థాయి కలిగిన నాయకులు ఎక్కడికైనా వెళ్తే.. అక్కడ ఒక రకమైన గంభీర వాతావరణం నెలకొంటుందని, ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. మ్యాచ్ ఓటమి అనంతరం డ్రెసింగ్ రూమ్‌లోకి వెళ్లిన మోదీ.. ఆటగాళ్లను ఓదార్చారు. ఓడిపోయినా.. టోర్నమెంట్‌లో సాధించిన దానికి దేశం గర్వపడుతున్నదని చెప్పారు.
‘భారత్ ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటుంది’ అని వారితో అన్నారు. ఈ మేరకు స్వల్ప వ్యవధి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పది మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకున్నదని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో చేతులు కలుపుతూ ప్రధాని అనడం ఆ వీడియోలో వినిపిస్తుంది. ‘నవ్వండి.. దేశం మిమ్మల్ని చూస్తున్నది’ అని చెప్పారు. టోర్నమెంట్‌లో భారతదేశం తరఫున అద్భుత ప్రతిభ కనబర్చిన మహ్మద్ షమీని ప్రధాని ఆలింగనం చేసుకున్నారు. బాగా ఆడావంటూ ప్రశంసించారు.
