దున్న అరుదైనది, బలిష్టమైనది.. ఆరోగ్యవంతమైనది. అంతేకాదు 150 దూడల జన్మకు కారణం ఈ దున్న. అలాంటి శ్రేష్ఠమైన దున్నను దాని యజమాని ఏకంగా రూ. 11 కోట్లకు అమ్మకానికి పెట్టాడు.

విధాత: ఈ దున్న అరుదైనది, బలిష్టమైనది.. ఆరోగ్యవంతమైనది. అంతేకాదు 150 దూడల జన్మకు కారణం ఈ దున్న. అలాంటి శ్రేష్ఠమైన దున్నను దాని యజమాని ఏకంగా రూ. 11 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. 1570 కిలోల బరువున్న ఈ దున్న అన్‌మోల్.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పశు మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని సిర్సాకు చెందిన హర్విందర్ సింగ్‌కు దున్నలంటే ఇష్టం. దీంతో అన్‌మోల్ అనే దున్నను తన సొంత కుమారుడి మాదిరిగా పెంచాడు. దీని వయసు ఎనిమిదేండ్లు కాగా, 5.8 అడుగుల పొడవు ఉంది. ఇక అన్‌మోల్‌కు ప్రతిరోజు అరటి పండ్లు, గుడ్లు వంటి బలమైన పోషకాహారం అందిస్తాడు. గతేడాది 1400 కిలోల బరువున్న ఈ దున్న ప్రస్తుతం 1,570 కిలోల బరువుకు చేరింది. ఈ దున్న వీర్యం వల్ల ఇప్పటి వరకు 40-50 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన 150 దూడలు జన్మించాయి. అన్‌మోల్ ఆహారం కోసం ప్రతి నెలా సుమారు మూడు లక్షలు ఖర్చు చేస్తున్నట్లు హర్విందర్ సింగ్ పేర్కొన్నారు.
మరోవైపు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పుష్కర్ మేళాకు ఈ దున్నను హర్విందర్ సింగ్ తీసుకొచ్చాడు. అరుదైన, బలిష్ఠమైన దున్నను రూ.11 కోట్లకు అమ్ముతానని తెలిపాడు. గత ఏడాది మూడు కోట్లకు కొనేందుకు ఒక వ్యక్తి ఆసక్తి చూపినప్పటికీ, అంత తక్కువకు అమ్మేందుకు అతడు నిరాకరించాడు. తన దున్న చాలా విలువైందని చెబుతున్న యజమాని సింగ్, రూ.11 కోట్లకు కొనే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.
